Share News

ముందుంది మరింత ఎండ!

ABN , Publish Date - May 11 , 2026 | 06:24 AM

రాష్ట్రంలో మంగళవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 18-22 తేదీల మధ్య ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ముందుంది మరింత ఎండ!

  • ఈనెల 18-22 మధ్య 47 డిగ్రీలకు చేరే అవకాశం

  • రేపటి నుంచి వడగాల్పుల తీవ్రత

  • మహబూబాబాద్‌లో వడగండ్ల వాన

హైదరాబాద్‌, మే 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంగళవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 18-22 తేదీల మధ్య ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు తెలంగాణలో 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మిగతా ప్రాంతాల్లో 46 డిగ్రీలకు చేరువగా ఉంటాయని, హైదరాబాద్‌లో సైతం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని, ఇది కనీసం పది రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా, రెండు మూడు రోజులుగా వాతావరణం కొద్దిగా చల్లబడడంతో ఎండల తీవ్రత తగ్గింది. ఆదివారం మళ్లీ స్వల్పంగా పెరిగింది. నిజామాబాద్‌ జిల్లా సాలూర మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాత్రం 40.2 డిగ్రీల్లోపే రికార్డు అయ్యాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు రోజుల తర్వాత నుంచి క్రమేపీ పెరుగుతాయని, రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వానతో అన్నదాతలకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. మొక్కజొన్న, వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పకపోవడంతో తడిసిపోయాయి. తడిసిన ధాన్యం,మక్కలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Updated Date - May 11 , 2026 | 06:24 AM