వానల్లేవ్.. ఉక్కపోతే
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:06 AM
రాష్ట్రంలో వాన జాడే కనిపించడం లేదు. ఎండలు మండుతూనే ఉన్నాయి. ఉక్కపోతే తప్ప.. చల్లని వాతావరణమే లేకుండాపోయింది.
వానాకాలంలోనూ మండుతున్న ఎండలు
జూలైలో 60 శాతం లోటు వర్షపాతం
వారం రోజులుగా పొడి వాతావరణమే
29 జిల్లాల్లో లోటు వర్షపాతం
సాగుబడి ఎలా అంటూ అన్నదాతల ఆందోళన
నేటినుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వాన జాడే కనిపించడం లేదు. ఎండలు మండుతూనే ఉన్నాయి. ఉక్కపోతే తప్ప.. చల్లని వాతావరణమే లేకుండాపోయింది. పేరుకే వానాకాలమైనా జల్లులు లేక జనం అల్లాడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వారం రోజులుగా తెలంగాణలో పొడివాతావరణమే నెలకొంది. మరోవైపు ఏప్రిల్ నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఖరీఫ్ సాగును ఎలా సాగించాలంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయితే గురువారం నుంచి వాతావరణంలో కాస్త మార్పులు చోటుచేసుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో నేటి నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తేలికపాటి జల్లులే తప్ప.. విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఏమాత్రం లేదని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకూ లోటు వర్షపాత శాతం నమోదవుతోంది. ఇప్పటికే జూలై మాసంలో 15 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు చెప్పుకోదగ్గ గట్టి వానలే పడలేదు. జూలై నెల సాధారణ వర్షపాతం 22.7 సెంటీమీటర్లు కాగా.. ఈ పదిహేను రోజుల్లో 10 సెంటీమీటర్ల మేరకు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సివుంది. కానీ ఇప్పటివరకు కేవలం 4 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే దాదాపు 60శాతం లోటు వర్షపాతం నమోదైంది. గతఏడాది ఇదే సమయానికి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హనుమకొండలో 66 శాతం లోటు వర్షపాతం
రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 29 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నల్లగొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు జిల్లాల్లో మాత్రమే ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాల్లోనైతే మరీ దారుణం.. ఆ జిల్లాలో ఇప్పటివరకు 66శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇక మండలాలవారీగా చూస్తే.. రాష్ట్రంలో 621 మండలాలు ఉంటే అందులో కేవలం ఐదుచోట్లే అత్యధిక, 25 చోట్ల అధిక, 125 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. 371 మండలాల్లో 20-59 శాతం మధ్య, 95 చోట్ల ఏకంగా 60-99 శాతం మధ్య తీవ్రలోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తంగా 75 శాతం మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కాగా జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 23.6 సెంటీమీటర్లు నమోదు అవ్వాల్సివుండగా.. ఇప్పటివరకు కేవలం 15 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది.