Share News

3 రోజుల పాటు భారీ వర్షాలు!

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:32 AM

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది.

3 రోజుల పాటు భారీ వర్షాలు!

  • రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం

  • జూలైలో కేవలం 11 సెం.మీ. వర్షపాతం

  • సాధారణంగా కురవాల్సింది 22 సెం.మీ

  • జూరాలకు 30 వేల క్యూసెక్కుల వరద

  • ఎస్సారెస్పీలోకి 2,894 క్యూసెక్కులు

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమ వారాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డిలో అత్యధికంగా 7.2, కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపల్లిలో 6.9, వికారాబాద్‌ జిల్లా మొమిన్‌పేటలో 6.4, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 6.3, మెదక్‌ జిల్లా శంకరం పేటలో 6.2, భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో 4.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న రైతులకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. తాజాగా మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న ప్రకటనతో సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో సగటున జూన్‌ నెలలో 13 సెంటీమీటర్లు, జూలైలో 22 సెంటీమీటర్ల వర్షం కురవాలి. గత ఏడాది ఇదే సమయానికి 33.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కానీ, ఈ ఏడాది తొలకరి నుంచే వానలు తక్కువగా పడుతున్నాయి. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో 10 సెంటీమీటర్లు, జూలైలో ఇప్పటివరకు 11 సెంటీమీటర్ల వర్షమే కురిసింది. మొత్తంగా రెండు నెలల్లో 10 సెం.మీ లోటు వర్షపాతం నమోదైంది. దాదాపుగా 26 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ములుగు, నాగర్‌కర్నూల్‌, కామారెడ్డి, మెదక్‌, నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం రికార్డయింది.


జూరాలకు 24వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌, భీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులు.. నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టికి 73,461 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 20,500 క్యూసెక్కుల వరద వస్తుండగా... గేట్లను ఎత్తడం ద్వారా 14,125 క్యూసెక్కులు, జలవిద్యుదుత్పత్తి కోసం 6వేలపైగా క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఉజ్జయిని ప్రాజెక్టుకు 69,492 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 3,695 క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 3,695 క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు సోమవారం 30,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం డ్యామ్‌కు 163 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... నాగార్జునసాగర్‌కు 4,970 క్యూసెక్కులు వస్తోంది. ఇక, మహారాష్ట్రలోని నాసిక్‌లో కురుస్తున్న వర్షాలతో గోదావరిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు సోమవారం 63,618 క్యూసెక్కుల వరద వచ్చింది.

Updated Date - Jul 28 , 2026 | 06:33 AM