Share News

నీటమునిగి 8 మంది మృతి

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:11 AM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడ్మి శివారులోని మంజీరా నదిలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందారు. మంజీరా నది సమీపంలోనే ఉన్న ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకునేందుకు....

నీటమునిగి 8 మంది మృతి

  • మృతుల్లో ఏడుగురు చిన్నారులే

  • మంజీరాలో స్నానానికి దిగి ముగ్గురు..

  • కుంటలో పడి మరో ముగ్గురు..

  • చెరువులో ఈతకు దిగి ఇద్దరి మృతి

  • కామారెడ్డి, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో ఘటనలు

బాన్సువాడటౌన్‌, భీంగల్‌, జడ్చర్ల, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడ్మి శివారులోని మంజీరా నదిలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందారు. మంజీరా నది సమీపంలోనే ఉన్న ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకునేందుకు పిట్లం మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన పండరి తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. మంజీరా నదిలో ఆరుగురు స్నానానికి దిగగా ఇద్దరు ఒడ్డుపైనే ఉన్నారు. నీటి లోతు కారణంగా మునిగిపోతున్న ఇద్దరిని బయటకు లాగారు. మిగతా నలుగురు గల్లంతయ్యారు. గాలింపులో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన పండరి కుమార్తె పావనశ్రీ (14), లింగంపేట మండలం పరమళ్ల గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు అనిత(40), శివాని(13) మృతిచెందారు. మరో బాలుడు భానుప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

మూడు ప్రాణాలు మింగిన కుంట

నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ పట్టణంలో కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. లింబాద్రి గుట్ట వద్ద గల వడ్డెర కాలానికి చెందిన హరీష్‌(11), కుమార్తె వర్షిణి (5), అరవింద్‌(4) ఆడుకునేందుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. బ్రాహ్మణ కుంట వద్ద చిన్నారుల దుస్తులు కనబడడంతో గజ ఈతగాళ్లతో గాలించగా ముగ్గురు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. చిన్నారుల తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుంటారని స్థానికులు తెలిపారు. అన్నాచెల్లెలు హరీష్‌, వర్షిణి మృతితో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.

ఈత కోసం వెళ్లి..

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామం సమీపంలోని చెరువులో ఈతకు దిగి ప్రమాదవశాత్తూ ఇద్దరు బాలురు మృతి చెందారు. జడ్చర్ల మునిసిపాలిటీలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన సోయల్‌(13), అబ్దుల్‌రహమన్‌(14) కిష్టంపల్లి చెరువులో ఈత కొట్టేందుకు దిగి మునిగిపోయారు. గాలింపు చర్యల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

Updated Date - Jun 06 , 2026 | 04:11 AM