Share News

పంట వ్యర్థాలు కాల్చితే భారీ జరిమానా!

ABN , Publish Date - May 26 , 2026 | 04:35 AM

వానాకాలం సీజన్‌ కోసం భూములను సిద్ధం చేసే క్రమంలో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ ...

పంట వ్యర్థాలు కాల్చితే భారీ జరిమానా!

  • రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌ కోసం భూములను సిద్ధం చేసే క్రమంలో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి హెచ్చరించారు. పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ జారీ చేసిన జీవో 27 ప్రకారం వ్యర్థాల దహనాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సాధారణ చెత్తను కాల్చితే రూ.5 వేలు, అదే భారీ స్థాయిలో వ్యర్థాలను తగులబెడితే రూ.25 వేల వరకు పర్యావరణ పరిహారం (జరిమానా) విధిస్తామని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల గాలి కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా, ముఖ్యంగా వేసవి కాలంలో మంటలు వేగంగా వ్యాపించి ఎద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని డైరెక్టర్‌ హెచ్చరించారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో చాగర్ల చంద్రమౌళి, భాగ్యమ్మ అనే ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రైతులు ఇలాంటి సులభమైన మార్గాలను ఎంచుకోకుండా, పంట అవశేషాలను నేలలోనే కలియదున్నాలని విజ్ఞప్తి చేశారు. అలా చేయడం వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుందని, రసాయన ఎరువుల వాడకం తగ్గి పెట్టబడి ఖర్చు కూడా కలసివస్తుందని వివరించారు.

Updated Date - May 26 , 2026 | 04:35 AM