Share News

ఓటర్ల గుర్తింపునకు ఆధార్‌

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:33 AM

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (సర్‌) ప్రక్రియలో భాగంగా.. ఓటర్ల అర్హత, వివరాల ధ్రువీకరణకు ఆధార్‌ కార్డు కీలకం కానుంది.

ఓటర్ల గుర్తింపునకు ఆధార్‌

  • ఇతర ధ్రువీకరణ పత్రాల్లేకపోతే అదే కీలకం.. 92.87 లక్షల మందికి నేటి నుంచి నోటీసులు

  • నోటీసులు వస్తే తప్పనిసరిగా స్పందించాలి.. అప్పుడే ఓటు సురక్షితం: ఎన్నికల అధికారులు

  • అర్హులెవరూ ఓటును కోల్పోకుండా చూడాలి.. అనామలీస్‌, నో మ్యాపింగ్‌ కేసులపై దృష్టి

  • అధికారులకు సీఈవో సుదర్శన్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (సర్‌) ప్రక్రియలో భాగంగా.. ఓటర్ల అర్హత, వివరాల ధ్రువీకరణకు ఆధార్‌ కార్డు కీలకం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 92.87 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసుల జారీ ప్రక్రియను వేగవంతం చేశారు. ఎన్యూమరేషన్‌ ఫారాలను పూర్తిగా నింపి సమర్పించినా.. గత రికార్డులతో మ్యాపింగ్‌ చేసే సమయంలో ఓటరు పేరు, తల్లిదండ్రుల పేర్లలో తప్పులు, చిరునామా సరిగా లేని తదితర కారణాలతో అనామలీస్‌ జాబితాలో చేరిన 60,50,918 మందికి.. అలాగే, ఎన్యుమరేషన్‌ ఫారంలో కేవలం మూడో కాలమ్‌ మాత్రమే నింపి, ఇతర వివరాలు సరిగ్గా నమోదు చేయని 32,36,659 మంది ఒటర్లకు తదుపరి పరిశీలన కోసం నోటీసులు జారీ కానున్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల పేరిట నోటీస్‌ పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చిన ఈఆర్‌వోలు వాటిని ప్రింట్‌ తీయించి బీఎల్‌వోలకు పంపిణీ చేయనున్నారు. వారి ద్వారా ఓటరు ఇంటికి వెళ్లి.. నోటీసులు జారీ చేసే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ‘‘ఓటరుకు నోటీసు రావడం అంటే ఓటు హక్కు తొలగించినట్లు కాదు. సంబంధిత ఓటరు తన భారతీయ పౌరసత్వం, నివాసం, ఓటరుగా నమోదుకు ఉన్న అర్హతను నిరూపించుకునేందుకు ఎన్నికల సంఘం కల్పిస్తున్న ఒక అవకాశం. ఎన్నికల అధికారులు ఇచ్చే నోటీసును నిర్లక్ష్యం చేయకుండా అందులో పేర్కొన్న గడువులోగా సమాధానం ఇవ్వాలి. అవసరమైన పత్రాలను సమర్పించి తమ వివరాలు, అర్హతపై స్పష్టత ఇవ్వాలి’’అని ఓ అధికారి తెలిపారు.


ఏ పత్రాలు సమర్పించాలి

ఇతర గుర్తింపు కార్డులు లేని సందర్భంలో ఆధార్‌ కార్డు కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నోటీసులో కోరిన అంశాన్ని బట్టి ఓటరు తన వాదనకు మద్దతుగా అందుబాటులో ఉన్న సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. ఆధార్‌ కార్డు, గత ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌, గత ఓటరు జాబితాలోని వివరాలు, జనన ధృవీకరణ పత్రం లేదా నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి. అలాగే, 2002 సర్‌ జాబితాలోని తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల పేర్ల రికార్డులను సైతం ఆధారాలుగా సమర్పించొచ్చు.


ఓటరు నమోదు, చిరునామా మార్పు కోసం దరఖాస్తులు

ఒకవైపు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు ఓటర్‌గా పేరు నమోదు చేసుకునేందుకు కొందరు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. సర్‌లో ఎన్యుమరేషన్‌ ఫారంలు సమర్పించని వారు.. అలాగే, 2002 ఓటర్‌ జాబితాలోని సమాచారం ఇవ్వలేక నో మ్యాపింగ్‌ జాబితాలో చేరిన వారు ఫారం-6 దరఖాస్తులు సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది. చిరునామా మార్పునకు ఫారం-8, జాబితా నుంచి పేరు తొలగింపునకు ఫారం-7లు కూడా వచ్చాయని జీహెచ్‌ఎంసీలోని ఎన్నికల విభాగం వర్గాలు తెలిపాయి. సర్‌ ప్రక్రియ ప్రారంభమైన గత రెండు నెలల్లో మూడు లక్షలకుపైగా ఫారం-6, 7, 8 దరఖాస్తులు రాగా.. ఇందులో 80 శాతానికిపైగా కొత్తగా పేరు నమోదు కోసం(ఫారం-6) వచ్చినవే ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. వాటిని పరిశీలించి వివరాలు అన్ని సరిగా ఉంటే ఆమోదిస్తామని తెలిపారు. ఇక, ముసాయిదా జాబితాలోని ఓటర్లపై కొన్ని అభ్యంతరాలు, ఫిర్యాదులు వస్తున్నాయి. ఉదాహరణకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-12లోని ఓ భవనం చిరునామాపై 44 మంది ఓటర్ల పేర్లు ఉన్నట్టు బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఆ చిరునామాలో ఓ సంస్థకు చెందిన వసతిగృహం ఉన్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. ఆ భవనం చిరునామాపై వందకుపైగా ఓట్లు ఉండగా.. ఫారంలు సమర్పించని వారి పేర్లను ఏఎస్‌డీ జాబితాలో చేర్చినట్టు తెలిసింది. అలాగే, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లోనూ ఒకే ఇంటి చిరునామాపై 10, అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఓట్లపైనా పరిశీలనకు అధికారులు సిద్ధమవుతున్నారు.


సమగ్ర పరిశీలన చేయాలి: సీఈఓ

సర్‌ ప్రక్రియలో భాగంగా అనామలీస్‌, నో మ్యాపింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈవో), ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌వో), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌వో)లతో విడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటర్లకు నోటీసులను బీఎల్‌వోలు స్వయంగా అందజేయాలని.. అందులో పేర్కొన్న అంశాలు, ఓటరు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు, సమర్పించాల్సిన పత్రాల గురించి స్పష్టంగా వివరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించినప్పటికీ ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు కనిపించని కేసులను ప్రత్యేకంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనామలీస్‌, నో మ్యాపింగ్‌ వివరాలను బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లకు అందించాలని, దీనివల్ల క్షేత్రస్థాయిలో సంబంధిత ఓటర్లను సంప్రదించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. అర్హులైన ప్రతివ్యక్తిపేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. సర్‌ ప్రక్రియలో భాగంగా ఫారం-6, 6ఏ, 7, 8 ద్వారా వచ్చిన క్లెయిమ్స్‌. అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

Updated Date - Aug 20 , 2026 | 05:34 AM