ఇద్దరు బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:14 AM
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్) విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు బీఎల్‌వోలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
బర్కత్‌పుర, కొత్తపేట, బీబీనగర్, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్) విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు బీఎల్‌వోలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంబర్‌పేట సర్కిల్ పరిధిలోని బర్కత్‌పుర వార్డు కార్యాలయంలో ఉస్మానియా యూనివర్శిటీ జూనియర్ అసిస్టెంట్ కృష్ణవేణి 222వ పోలింగ్ బూత్‌లో, అదే యూనివర్శిటీకి చెందిన ఎల్లమ్మ 227వ పోలింగ్ బూత్‌లో బీఎల్‌వోలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఎన్యూమరేషన్ దరఖాస్తులు అందజేయడంలో, వాటిని స్వీకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అంబర్‌పేట సర్కిల్ డీఎంసీ మారుతి దివాకర్ తెలిపారు. అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో 10 శాతం కూడా సర్ పూర్తి కాలేదని తెలిపారు.
భరత్‌నగర్‌లో ఒకే ఇంటి నెంబరుపై 48 మంది ఓటర్లు!
కొత్తపేట డివిజన్ భరత్‌నగర్‌లో రెండు గదులున్న ఒకే ఇంటి నెంబరుపై 48 మంది ఓటర్లు ఉన్నట్లు బీఎల్‌వో గుర్తించారు. భరత్‌నగర్‌లో ఇంటింటికీ తిరుగుతూ బీఎల్‌వో స్వప్న ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 3-13-499 నెంబరు ఇంటి వద్దకు వెళ్లి ఫారాల్లోని ఓటర్ల కోసం వాకబు చేస్తే ఈ విషయం బయటపడింది. వాస్తవానికి ఆ ఇంట్లో ప్రస్తుతం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. వారికి ఫారాలు అందజేశారు. మిగతా 45 మంది ఓటర్లు సదరు ఇంట్లో లేరనే విషయాన్ని అధికారులకు తెలిపి, ఆ ఫారాలను కార్యాలయంలో అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. శిమ్మనగర్, రాజీవ్‌గాంధీనగర్ లలోను చిన్న గదుల ఇంటి నెంబర్లపై అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు ఫారాల పంపిణీలో బయటపడుతోందని స్థానికులు తెలిపారు.