ఓటర్లకు ఫారమేది?
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:40 AM
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో మరో కొత్త సమస్య మొదలైంది. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన చాలా మందికి ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదు. ఇందుకు ప్రధాన కారణం..
2023, 24 ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లలో కొందరికి షాక్
తాజా ఓటరు జాబితాలో కనిపించని ఆ ఓటర్ల పేర్లు
పలు కాలనీల్లో 20 శాతానికిపైగా పేర్లు మాయం
ఎపిక్ కార్డుల ఆధారంగా వెతికినా ఫలితం శూన్యం
ఆందోళనొద్దు.. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు: అధికారులు
ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ 66.58 శాతం పూర్తి: సీఈవో
హైదరాబాద్/ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో మరో కొత్త సమస్య మొదలైంది. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన చాలా మందికి ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదు. ఇందుకు ప్రధాన కారణం.. వారిలో చాలామంది పేర్లు తాజా ఓటరు జాబితాలో లేకపోవడమే. జూన్ 10, 2026 వరకు నమోదైన ఓటర్ల వివరాలతో రూపొందించిన జాబితా ఆధారంగా ఎన్యుమరేషన్ ఫారాలు ముద్రించి పంపిణీ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కొత్తగా నమోదు చేసుకున్న వారికి ఫారాల పంపిణీ విషయాన్ని పక్కన పెడితే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న దాదాపు 20 శాతం మందికిపైగా పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఈ సమస్య ఉంది. ఎపిక్ నెంబరు ఆధారంగా ఆన్‌లైన్‌లో వివరాల కోసం వెతికితే ‘వివరాలు కనిపించడం లేదు’ అని చూపుతోందని ఓటర్లు చెబుతున్నారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. తమ ప్రాంతంలో 20 శాతం మందికిపైగా పేర్లు జాబితాలో లేవని, వారికి ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని శేరిలింగంపల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. ఇదిలా ఉంటే ఓటరు ఫారాల్లో వివరాలు, స్పష్టమైన ఫొటోలు లేకపోవడంతో కొందరిని గుర్తించలేకపోతున్నామని బీఎల్‌వోలు చెబుతున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 45 శాతం ఓటర్ల ఫారాలు ఇప్పటికీ బీఎల్‌వోల వద్దే ఉన్నాయి. వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. వంద శాతం పంపిణీ చేసినట్టు ఆన్‌లైన్‌లో చూపుతున్నారు.
కొందరి నియోజకవర్గాలు కూడా మారిపోయాయి. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికంగా ఓటు వేశారు. ప్రస్తుత జాబితాలో ఆమె పేరు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉన్నట్టు చూపుతోంది. ఖైరతాబాద్ ఆడ్ర్‌సలో ఆమె కుటుంబ సభ్యులకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన బీఎల్‌వో.. ఆమె ఓటు ఇక్కడ లేదని ఫారం ఇవ్వలేమని చెప్పారు. కాగా, ఎన్యుమరేషన్ ఫారాలు అందనివారు అక్టోబరు రెండో వారం నుంచి సరైన వివరాలతో కొత్తగా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
సర్ డిజిటలైజేషన్ 66.58 శాతం పూర్తి: ఎన్నికల సంఘం సీఈవో
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ 66.58 శాతం పూర్తయిందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని... వివరాల నమోదు కొనసాగుతోందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల్లోని వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లా (89.42 ఽశాతం) మొదటి స్థానంలో ఉండగా, మేడ్చల్ జిల్లా (39.91 శాతం) చివరి స్థానంలో ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,38,26,448 ఉండగా... వందశాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 2,25,25,055 (66.58 శాతం) మందికి సంబంధించిన ఫారాలను డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. అయితే.. డిజిటైజేషన్ ప్రక్రియ నల్లగొండ జిల్లాలో 83.62 శాతం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 82.78 శాతం, జనగామ జిల్లాలో 82.17 శాతం పూర్తయిందని వివరించారు. ఈ విషయంలో హైదరాబాద్ (41.73 శాతం), రంగారెడ్డి జిల్లా (50.82 శాతం)లు వెనుకబడి ఉన్నట్లు చెప్పారు.