3 వరకు సర్
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:47 AM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును పది రోజుల పాటు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నిర్ణయం తీసుకుంది.
గడువు పెంచిన ఎన్నికల కమిషన్
అప్పటిదాకా ఎన్యుమరేషన్ ఫారాల
స్వీకరణ.. సవరణ షెడ్యూల్ జారీ
10న ముసాయిదా ఓటరు జాబితా
సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాల
స్వీకరణ.. అక్టోబరు 12న తుది జాబితా
రాష్ట్రంలో నత్తనడకన సర్ ప్రక్రియ
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును పది రోజుల పాటు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నిర్ణయం తీసుకుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ ఈనెల 24వ తేదీకే పూర్తి కావాల్సి ఉండగా, ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించడంలో ఆలస్యమవుతోంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా అనుకున్న సమయంలో పూర్తికావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ప్రక్రియ గడువును 10రోజులపాటు పొడిగిస్తూ సవరణ షెడ్యూల్‌ను బుధవారం ఈసీఐ విడుదల చేసింది. దీని ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాను జూలై 31కి బదులుగా ఆగస్టు 10న విడుదల చేయనున్నారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. అక్టోబరు 8లోగా వాటిని పరిష్కరించి, అక్టోబరు 12న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికీ 50శాతం ఓటర్లు మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసి సమర్పించారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఓటర్లు అందుబాటులో లేకపోవడం, కొంతమంది అవసరమైన పత్రాలు సిద్ధం చేయకపోవడం, సిబ్బందిపై అదనపు పని భారం వంటి అంశాలు ప్రక్రియ ఆలస్యానికి కారణమవుతున్నాయి. పట్టణాల్లో ఓటర్ల చిరునామాలు దొరక్కపోవడంతో ఫారాల పంపిణీ ఇబ్బందికరంగా మారిందని అధికారులు చెబుతుండగా, అదే చిరునామాలో ఉన్న వారికీ బీఎల్‌వోలు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సర్ గడువును పెంచిన ఈసీఐ.. తెలంగాణలోనూ 10 రోజులపాటు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.