Share News

అనుకున్నట్లు పూర్తయ్యేనా సర్‌?

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:35 AM

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేయడానికి సోమవారమే చివరిరోజు.

అనుకున్నట్లు పూర్తయ్యేనా సర్‌?

  • నేటితో ఎన్యుమరేషన్‌ ఫారాల అందజేతకు గడువు పూర్తి

  • 78.14 శాతం డిజిటైజేషన్‌ .. 74 లక్షల పత్రాల పెండింగ్‌

  • గడువు పొడిగింపు ఉండదంటున్న అధికారులు

  • తీవ్ర అయోమయంలో పట్టణ ప్రాంతాల ఓటర్లు

హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేయడానికి సోమవారమే చివరిరోజు. గడువు ముగియడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం అనుకున్న విధంగా సర్‌ ప్రక్రియ పూర్తవుతుందా? అని సర్వత్రా చర్చ కొనసాగుతోంది. అధికార వర్గాలు చెబుతున్న ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా... వారందరికీ ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసినప్పటికీ.. వాటి డిజిటైజేషన్‌ ప్రక్రియ మాత్రం 78.14 శాతమే పూర్తయింది. ఇప్పటివరకు 2,64,30,494 ఫారాల డిజిటైజేషన్‌ పూర్తికాగా మిగిలిన 73,95,964 మంది ఓటర్ల వివరాలు ఇంకా నమోదు చేయలేదు. ఇందులో రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు, అనర్హులు, చనిపోయినవారు ఎంతమంది అన్నది డిజిటైజేషన్‌ పూర్తయితే వెల్లడవుతుందని అంటున్నారు. ఒక్కరోజులో మిగిలిన డిజిటైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయడం బీఎల్‌వోలు, ఎన్నికల అధికారులకు సవాలుగా మారింది. అదే సమయంలో ఎన్యుమరేషన్‌ ఫారాలు తీసుకుని, వాటిని పూర్తిచేసి ఇవ్వని ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు పెంచుతారా? ప్రత్యామ్నాయం ఏంటి? అనే అయోమయంలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటైజేషన్‌లో గ్రామీణ ప్రాంతాలు ముందంజలో ఉండగా హైదరాబాద్‌ 58.58 శాతం, మేడ్చల్‌ మల్కాజిగిరి 63.82, రంగారెడ్డి 64.91 శాతంతో వెనుకంజలో ఉన్నాయి. హైదరాబాద్‌ లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 27,74,687 ఫారాలు మాత్రమే డిజిటలైజ్‌ అయ్యాయి.


దాదాపు 19.6 లక్షల ఫారాలను డిజిటలైజ్‌ చేయాలి. మేడ్చల్‌ మల్కాజిగిరిలో సుమారు 10.8 లక్షలు, రంగారెడ్డిలో సుమారు 13 లక్షలకు పైగా ఫారాలు డిజిటైౖజ్‌ కావాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో చిరునామాలు గుర్తించడం, ఓటర్లను సంప్రదించడం, అందుబాటులో లేని ఓటర్ల నుంచి ఫారాలు పొందడం వంటి అంశాలు బీఎల్‌వోలు, ఎన్నికల అధికారులకు సవాలుగా మారింది. ఒక్కరోజులో ఈ ప్రక్రియ పూర్తవుతుందా? అధికారుల కార్యాచరణ ఏమిటన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. గ్రామీణ జిల్లాల్లో ఎన్యుమరేషన్‌ ప్రక్రియ వేగంగా సాగింది. కొన్ని జిల్లాలు ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తి చేశాయి. యాదాద్రి భువనగిరి 94.30 శాతం, జనగామ 91.69 శాతం, మెదక్‌ 90.54 శాతంతో ముందంజలో ఉన్నాయి.


గడువు పొడిగింపు ఉండదంటున్న అధికారులు

క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సర్‌ ప్రక్రియకు ముందుగా నిర్దేశించిన గడువును మూడుసార్లు పొడిగించింది. మరోసారి పొడిగించే పరిస్థితి లేదని, షెడ్యూల్‌ ప్రకారం ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించేందుకు తొలుత జూలై 24 వరకే గడువు ఇవ్వగా.. తర్వాత ఈ నెల 3 వరకు, ఆపై ఈ నెల 10 వరకు పొడిగించారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ కూడా అదే రోజుకల్లా పూర్తిచేయాలి. అలాగే షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించాలి. ఆ రోజు నుంచి సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు స్వీకరించాలి. అక్టోబరు 15కల్లా వాటిని పరిష్కరించాలి. అక్టోబరు 19న తుది ఓటరు జాబితా ప్రచురించాలి.

Updated Date - Aug 10 , 2026 | 05:37 AM