లైఫ్ సైన్సెస్‌లో.. 2030 నాటికి 5 లక్షల మందికి ఉద్యోగాలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 04:12 AM
2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని...
భవిష్యత్తు ల్యాబొరేటరీగా హైదరాబాద్: శ్రీధర్ బాబు
7 రకాల క్యాన్సర్లు గుర్తించే కిట్ ఆవిష్కరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే ‘తెలంగాణ నెక్స్ట్ - జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030)’ రూపొందించామని చెప్పారు. ‘బయో ఏషియా 2026’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ను ‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్‌ఎన్‌ఏ, జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామన్నారు. సీబీఆర్‌ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం.. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో లాంటి గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని వెల్లడించారు. కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా, నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త ఔషధాలను కనుగొనే కేంద్రంగానూ హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
వంద ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్-4
అత్యాధునిక మౌలిక వసతులతో జినోమ్ వ్యాలీ ఫేజ్-4నువంద ఎకరాల్లో విస్తరించబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టెక్నాలజీతో భౌగోళిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు అనుగుణంగానే ఈ సదస్సును నిర్వహించామన్నారు. ఆరోగ్య సంరక్షణను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మార్పులకు అనుగుణంగా..లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో మెరుగైన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ హైదరాబాద్‌ను.. లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్ గా మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు.