వామ్మో జ్వరం
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:52 AM
రాష్ట్రవ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవుట్ పేషెంట్ (ఓపీ) కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.
వైరల్ ఫీవర్లతో ఆస్పత్రులు కిటకిట
ఎడినో వైరస్ అంటున్న వైద్యులు.. కొన్నిచోట్ల డెంగీ కూడా..
గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రతి 10 కేసుల్లో తొమ్మిది జ్వరాలే
ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటుపై నిర్లక్ష్యం.. పిల్లల నుంచి తల్లిదండ్రులకు జ్వరాలు
అవగాహన కల్పించడంలో ప్రజారోగ్య శాఖ విఫలం
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవుట్ పేషెంట్ (ఓపీ) కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో జ్వర కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండడంతో నీరు కలుషితమవడం, చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని రకాల వైర్‌సలు విజృంభిస్తున్నాయి. నీరు, ఆహారం కలుషితం కావడంతో డయేరియా కేసులూ నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో జ్వర కేసులు రెట్టిం పు స్థాయిలో వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు వచ్చే ప్రతి పది ఓపీ కేసుల్లో 9 మంది జ్వర బాధితులే ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రి లో గత వారం ప్రతి పది కేసుల్లో నాలుగైదు జ్వర కేసులు వస్తే.. 3-4 రోజులుగా 7-8 కేసు లు నమోదు అవుతున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. అలాగే పటాన్‌చెరువు ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా జ్వర కేసులతో ఓపీ కిటకిటలాడిపోతోంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఎడినో వైరస్ కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ బారిన పడితే తీవ్రమైన జ్వరం, విపరీతంగా విరేచనాలు అవుతాయి. ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం 102 నుంచి 104 డిగ్రీల వరకు ఉంటుంది. వైరల్ అయితే కనీసం ఐదారు రోజుల పాటు తీవ్రమైన జ్వరం ఉంటుంది. కొందరిలో గొంతు నొప్పి, ఫ్లూ లాంటి లక్షణాలూ కనిపిస్తున్నాయని జిల్లాల్లోని వైద్యులు చెబుతున్నారు. ఎడినో వైరస్, వైరల్ జ్వరాలతో పాటు డెంగీ కేసులు కూడా నమోదవుతున్నాయని అంటున్నారు. అలాగే ఇన్‌ఫ్లూయెంజాలో హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.
పిల్లల నుంచి కుటుంబ సభ్యులకు..
వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా స్కూల్ పిల్లల్లో కనిపిస్తున్నాయి. వారి ద్వారా ఇంట్లో వారంతా జ్వరాల బారిన పడుతున్నారు. కొందరు పిల్లల్లో జ్వర తీవ్రత 102-104 మధ్య ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వర తీవ్రత అలాగే ఉంటే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఫీవర్ సర్వే.. క్లినిక్స్.. ఎక్కడ?
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో ప్రజారోగ్య విభాగం అప్రమత్తంగా ఉండాలి. కానీ, ఫీవర్ కేసులు పెరుగుతున్నా ఉన్నతాధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. జిల్లాల్లో పర్యటించడం లేదు. క్షేత్రస్థాయి అనుభవం లేకపోవడంతో ఈ పరిస్థితులను సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరాలు ఎక్కువగా ఉన్నపుపడు వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని బోధనాస్పత్రుల్లో ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి. కానీ, ఇప్పటికీ చేయలేదు.
వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి..
సాఽధారణంగా వైరల్ జ్వరం వస్తే మొదటి మూడు రోజులు తీవ్రంగా ఉంటుంది. తర్వాత క్రమంగా తగ్గుతుంది. లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకోవాలి. ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో పాటు ఫ్లూ వైర్‌సల కేసులు నమోదు అవుతున్నాయి. ఇటువంటి కేసుల్లో యాంటీ బయాటిక్ అస్సలు వాడకూడదు. వీలైనంత వరకు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. వైరల్ ఫీవర్ ఉంటే ఎక్కువగా డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నీరు ఎక్కువగా తాగాలి. జ్వరంతో పాటు బాడీపెయిన్స్, తలనొప్పి లాంటి లక్షణాలుంటే డెంగీ పరీక్ష చేయించుకోవాలి. ప్లేట్‌లెట్స్ చూసుకొని అనవసరంగా భయపడవద్దు.
- డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి,