దేశానికి ఆదర్శం తెలంగాణ పల్లెలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:46 AM
తెలంగాణ గ్రామీణ ప్రగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ పంచాయతీ అవార్డులు-2025కు ఎంపికైన మోత్కుపల్లి, ఫసల్వాడి పంచాయతీలకు బుధవారం.....
మోత్కుపల్లి, ఫసల్వాడి పంచాయతీలకు జాతీయస్థాయి పురస్కారాలు
జాతీయ పంచాయతీ అవార్డులు-2025 ప్రదానం
న్యూఢిల్లీ, వికారాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రామీణ ప్రగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ పంచాయతీ అవార్డులు-2025కు ఎంపికైన మోత్కుపల్లి, ఫసల్వాడి పంచాయతీలకు బుధవారం జాతీయ అవార్డులు అందా యి. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మే 9న ’జాతీయ పంచాయతీ అవార్డులు-- 2025’ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 42 పంచాయతీలను అవార్డులకు ఎంపిక చేసింది. ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్’ విభాగంలో 34 పంచాయతీలు, ‘నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్’ విభాగంలో 8 పంచాయతీలు అవార్డులకు ఎంపికయ్యా యి. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) విభాగంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారానికి ఎంపికైంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలంలోని ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ేస్నహపూర్వక (ఉమెన్ ఫ్రెండ్లీ థీమ్) విభాగంలో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు కైవసం చేసుకుంది. న్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) చేతుల మీదుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జడ్పీ సీఈఓ సుధీర్, మోత్కుపల్లి సర్పంచ్ అమృతమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అవార్డును అందుకున్నారు. అవార్డుతోపాటు మోత్కుపల్లి పంచాయతీకి రూ.50లక్షల నగదు బహుమతి కూడా దక్కింది. ఇక, ఫసల్వాడికి అవార్డుతోపాటు రూ.25లక్షల నగదు బహుమతి లభించింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఫసల్వాడి గ్రామ సర్పంచ్ హరి ప్రసాద్ కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.
