నేత్రదానంలో ఆదర్శం ఇక్కరెడ్డిగూడ
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:59 AM
చిన్న గ్రామమే అయినా పెద్ద ఆలోచన చేసి నేత్రదానంలో ఆదర్శంగా నిలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువల్లి పంచాయతీ అనుబంధ గ్రామం..
గ్రామమంతా నేత్రదానానికి అంగీకారం!
చేవెళ్ల, జూన్ 18(ఆంధ్రజ్యోతి): చిన్న గ్రామమే అయినా పెద్ద ఆలోచన చేసి నేత్రదానంలో ఆదర్శంగా నిలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువల్లి పంచాయతీ అనుబంధ గ్రామం ఇక్కరెడ్డిగూడలో 90శాతం కుటుంబాలు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నాయి. ఐకమత్యంగా ఉండే ప్రజలంతా 2010లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం మరొకరికి ఉపయోగపడే కళ్లను దానం చేసి వారి జీవితంలో వెలుగు నింపాలని సంకల్పించారు. నేత్రదానానికి స్వామి వివేకానంద యువజన సంఘం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. అప్పటి నుంచి మరణానంతరం 17 మంది నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు సేకరించారు. గ్రామానికి చెందిన బస్తేపూరం అంతయ్య (65) అనారోగ్యంతో బుధవారం ఇంటి వద్దే మృతిచెందారు. 2015లోనే ఆయన నేత్రదానానికి అంగీకార పత్రం రాసిచ్చారు. మరొకరి జీవితంలో వెలుగు నింపాలన్న ఆయన ఆకాంక్ష మేరకు కుమారుడు శ్రీనివాస్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు గ్రామానికి వచ్చి అంతయ్య నేత్రాలను సేకరించి తీసుకెళ్లారు. గ్రామస్థుల సహకారంతో నేత్రదానాన్ని కొనసాగిస్తున్నామని యువజన సంఘం అధ్యక్షుడు గణపతి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గ్రామ జనాభా 550లో ఇప్పటికే 520 మంది నేత్రదానానికి అంగీకార పత్రాలు రాసిచ్చారు.