Telangana Vigilance: రూ.60 కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:57 AM
ప్రభుత్వ ధాన్యం నిల్వలు దారిమళ్లింపును అరికట్టేందుకు తెలంగాణ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం భారీ ఎత్తున ఆకస్మిక తనిఖీలు చేపట్టింది
9 జిల్లాల్లోని 19 రైసు మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ధాన్యం నిల్వలు దారిమళ్లింపును అరికట్టేందుకు తెలంగాణ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం భారీ ఎత్తున ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 19 రైస్ మిల్లుల్లో విజిలెన్స్ బృందాలు సోమవారం తనిఖీలు చేపట్టగా.. రూ.60 కోట్లకు పైగా విలువైన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) పక్కదారి పట్టిన విషయం బయటపడింది. మహబూబాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సూర్యాపేట, నల్లగొండ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 19 రైసు మిల్లుల్లో విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. 1.90లక్షల క్వింటాళ్లకు పైగా సీఎంఆర్ దారిమళ్లినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి 5 రైసు మిల్లులకు నోటీసులు జారీ చేశారు. తప్పు చేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని విజిలెన్స్ విభాగం డీజీ షికా గోయల్ తెలిపారు. అలాగే, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేసేందుకు, అవినీతికి పాల్పడిన మిల్లర్ల లైసెన్సులు చేయాలని, అక్రమార్కులను బ్లాక్ లిస్టులో పెట్టాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. టోల్ ఫ్రీ నం.14432కు ఫోన్ చేసి రైసు మిల్లుల్లో అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని ఆమె ప్రజలను కోరారు.