వనజ మృతిపై కదిలిన యంత్రాంగం
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:35 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శంభునిగూడెం గ్రామానికి చెందిన బాలింత కుంజా వనజ(20) మృతి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం...
మంత్రి దామోదర ఆదేశాలతో తక్షణ విచారణ
వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం చేసిన..ఆశా కార్యకర్త, ఇద్దరు ఏఎన్‌ఎంలపై చర్యలు
మృతురాలి కుటుంబ సభ్యులను కలిసిన డీఎంహెచ్‌వో
హైదరాబాద్/గుండాల, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శంభునిగూడెం గ్రామానికి చెందిన బాలింత కుంజా వనజ(20) మృతి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. అన్ని విధాలుగా చికిత్స అందించినప్పటికీ, తీవ్రమైన రక్తస్రావం కారణంగా హీమరేజిక్ షాక్, అనంతరం కార్డియాక్ అరెస్ట్‌తో వనజ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆశా కార్యకర్త మొకల్ల లక్ష్మి, ఏఎన్‌ఎం పి. ధనమ్మ, ఆ రోజు గుండాల పీహెచ్‌సీలో విధుల్లో ఉన్న ఏఎన్‌ఎం జ్ఞానేశ్వరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, జాయింట్ డైరెక్టర్ (మాతా-శిశు ఆరోగ్యం) డాక్టర్ సుధీర, భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్‌లో డాక్టర్ తుకారామ్, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్ జి. రవిబాబు సభ్యులుగా ఉన్నతస్థాయి బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ బృందం పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. శుక్రవారం డీఎంహెచ్‌వో తుకారాం, డాక్టర్ రవిబాబు ఇల్లెందు, గుండాల ఆస్పత్రుల్లో విచారణ చేశారు. గుండాలలో వైద్యాధికారి లేకుండా వైద్యం ఎలా అందించారని ప్రసవం చేసిన ఏఎన్‌ఎంను ప్రశ్నించారు. అనంతరం మృతురాలి గ్రామం శంభునిగూడెం వెళ్లి బాదిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వనజ భర్త సంజీవరావు మాట్లాడుతూ.. గుండాలలోనే తన భార్యకు ఆపరేషన్ చేసి పాపను బయటకు తీసి కుట్లు వేయకుండా కడుపులో కత్తెర పెట్టి మర్చిపోయారని, ఇల్లెందు ఆస్పత్రి వారి ద్వారా తమకు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తల్లీబిడ్డ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో తుకారాం మాట్లాడుతూ.. గుండాల ఆస్పత్రిలో అవగాహన లేకుండా వైద్యం అందించారని తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అసలు ఆపరేషన్ జరుగకుండా కత్తెర ఎలా వచ్చిందనే దానిపై సమగ్ర విచారణ జరిపి కారకులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.