ఆర్డీఎస్ ఆధునికీకరణ చేపట్టాలి
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:25 AM
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులు చేపట్టేలా కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆ దిశగా కర్ణాటక సర్కార్‌పై ఒత్తిడి తేవాలి
తుమ్మిళ్ల రెండో దశ పనుల్లో వేగం పెంచాలి
సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆదేశం
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులు చేపట్టేలా కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్తగా అమర్చిన గేట్లను ఈనెల 25న ప్రారంభించనున్న నేపథ్యంలో కర్ణాటకతో ఏయే అంశాలు చర్చించాలనే అంశంపై సోమవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగభద్ర జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు వివరించారు. ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులు ఉండగా... ఏ ఒక్క ఏడాది కూడా పూర్తి స్థాయిలో నీరు అందలేదని తెలిపారు. కాలువ కట్టల్లో సీపేజీ తీవ్రంగా ఉందని, వెంట్లకు గేట్లు పూర్తిగా ఉంటేనే వాటా మేరకు తెలంగాణకు నీళ్లు వస్తాయని తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం.. రెండో దశ పూర్తయితేనే ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తమ్ స్పందిస్తూ.. ఆర్డీఎస్ ఆధునికీకరణపై నిపుణుల కమిటీ నివేదికను అమలు చేసేలా కర్ణాటకపై ఒత్తిడి పెంచుదామన్నారు. ఈ అంశంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు జరిపి... ఆధునికీకరణ పనులు జరిగేలా చూస్తామన్నారు. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర బోర్డులో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్త్ను అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, జలాశయ నిర్వహణ, కాలువల ఆపరేషన్లు, మౌలిక వసతుల సంరక్షణ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచంచారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశలో భాగంగా మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే, ఆర్‌డీఎస్ నిర్వహణ, కేసీ కెనాల్, అంతర్రాష్ట్ర సమన్వయం, ట్రైబ్యునల్ తీర్పుల అమలు వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు. సాంకేతిక అంశాలు, రైతుల ఆందోళనలు, న్యాయపరమైన అంశాలు, విధానపరమైన ప్రత్యామ్నాయాలపై సమగ్ర నివేదిక సిద్థం చేసి ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.