రెండు రాజధానులను కలిపే హైవే ఇది
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:12 AM
తెలంగాణలోని భారత్ ఫ్యూచర్‌సిటీ నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకూ ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల పరంపర నడుస్తోంది.
విజయవాడ హైవే విస్తరణతో దీనికి లింకు పెట్టొద్దు
ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టుకు 12 లేన్ల హైవేను
మంజూరు చేయాలని కోరుతూ కేంద్రానికి మరోసారి లేఖ
రాష్ట్ర సర్కారు అభ్యర్థనను పరిశీలిస్తామన్న కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని భారత్ ఫ్యూచర్‌సిటీ నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకూ ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల పరంపర నడుస్తోంది. ఈ రోడ్డు అవసరం లేదన్న భావన స్ఫురించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి లేఖ రాయగా, ఆ రోడ్డు ఆవశ్యకత సహా వివరాలను తెలుపుతూ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, మచిలీపట్నం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆరు లేన్ల రహదారిగా విస్తరిస్తున్నామని, తద్వారా ఏపీ పునర్య్వవస్థీకరణ చట్టం-2014లో కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చినట్టేనని కేంద్ర సర్కారు రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్రం రాసిన లేఖలో పేర్కొన్న ప్రతి విషయానికీ రాష్ట్ర సర్కారు తన లేఖలో సమాధానం తెలిపింది. ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ హైవేను మంజూరు చేయాలని మరోసారి కోరింది. హైదరాబాద్- విజయవాడ- మచిలీపట్నం/మచిలీపట్నం పోర్టు వరకు చేయబోయే 6 లేన్ల విస్తరణ పనులకు.. ఫ్యూచర్‌సిటీ-బందరు పోర్టు కొత్త రోడ్డుకు లింకు పెట్టొద్దని విజ్ఞప్తి చేసింది. బందరు పోర్టు వరకూ ప్రతిపాదించిన రోడ్డు పూర్తిగా రెండు రాజధానులు, ఆ మధ్యలోని కొత్త ప్రాంతాలను కలిపే మార్గమని స్పష్టం చేసింది.
లేఖలో ఏముందంటే..
‘‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 13వ షెడ్యూల్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ముఖ్య నగరాలకు రైల్, రోడ్డు మార్గాల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలి. అలాగే, తెలంగాణలోని వెనుక బడిన ప్రాంతాల్లో రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అవసరమైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం పెండింగ్ సమస్యలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన 03.02.2025న సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనూ హై స్పీడ్ అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఇదే అంశంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 09.09.2025న భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి అమరావతి వరకూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కోసం వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే, హైదరాబాద్ నగరంలోని ముచ్చర్ల సమీపంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ప్రారంభమై, అమరావతి మీదుగా బందరు పోర్ట్ సమీపంలో 297.82 కిలోమీటర్ వద్ద ముగిసేలా తాత్కాలిక అలైన్‌మెంట్‌ను సమర్పించాం.
ఈ ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ రహదారి పొడవు తెలంగాణలో 118 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 179 కిలోమీటర్లు ఉంటుంది. దీనికోసం డీపీఆర్ కన్సల్టెంట్‌ను నియమించాలని, హైదరాబాద్ (భారత్ ఫ్యూచర్ సిటీ) నుంచి అమరావతి మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ పోర్ట్ వరకు 12 లేన్ల (120 మీటర్ల వెడల్పు - ఆర్వోడబ్ల్యూ) గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. హైదరాబాద్ సమీపంలో ప్రతిపాదించిన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (డ్రై పోర్ట్)ను ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ పోర్ట్‌తో అనుసంధానించే ఎక్స్‌ప్రెస్ వే అవసరం ఎంతైనా ఉంది. ఇది రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, సరకు రవాణా వ్యయాన్ని తగ్గిస్తుంది. ప్రాంతీయంగా, దేశవ్యాప్తంగా పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు తోడ్పడుతుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ - 2047’ డాక్యుమెంట్‌లోనూ ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ ఒక భాగమే. కేంద్రం ఎన్‌హెచ్-65లోని ప్రస్తుత 4 లేన్ల హైదరాబాద్-విజయవాడ -మచిలీపట్నం సెక్షన్‌ను మరేదైనా ప్రోగ్రామ్ లేదా నిధుల కింద 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్‌గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. అయితే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 నిబంధనల కింద మాత్రం కాదు. అందుకే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద ఇప్పటికే సమర్పించిన అలైన్‌మెంట్ ప్రతిపాదనల ప్రకారం, హైదరాబాద్ (భారత్ ఫ్యూచర్ సిటీ) నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ల (120 మీటర్ల రైట్ ఆఫ్ వే) గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను మంజూరు చేయవలసిందిగా మరోసారి కోరుతున్నాం.’’ అని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొంది.
నిబంధనల్లోనే...
ఎన్‌హెచ్-65 మార్గం మంజూరైన సమయంలోనే 13 ఏళ్ల తరువాత అంటే 2025నాటికి దానిని 6 వరుసలుగా విస్తరించాలనే నిబంధనను కేంద్రానికి గుర్తుచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ హైవే విస్తరణ విషయం పునర్విభజన అంశంలో లేదుగనుక.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్‌సిటీ - బందరు పోర్టు రోడ్డును ఏపీ పునర్విభజన చట్టం కిందనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. కాగా.. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా దాదాపు పూర్తికావొస్తోందని, అలాగే ప్రస్తుతమున్న హైదరాబాద్ -విజయవాడ హైవేకు, ఫ్యూచర్‌సిటీ-బందరు పోర్టు రోడ్డుకు మధ్యన దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉన్నదని, ఒకటి- రెండు చోట్ల మాత్రమే 20 కిలోమీటర్ల దూరం ఉంటుందన్న విషయాన్ని కూడా తెలిపింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలోని విజ్ఞప్తులను.. పరిశీలిస్తామని కేంద్రం మౌఖికంగా చెప్పినట్టు సమాచారం.