Deputy CM Bhatti Vikramarka: ప్రధాన ప్రాజెక్టులకు నిధులివ్వండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:46 AM
తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్-అమరావతి హైవేకు 17వేల కోట్లు, రేడియల్ రోడ్ల నిర్మాణానికి 45 వేల కోట్ల్లు
కేటాయించండి..కేంద్రానికి భట్టి వినతులు
న్యూఢిల్లీ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి రూ.17 వేల కోట్లు, హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం రూ.17,212 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం రూ.14,100 కోట్లు, రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.45 వేల కోట్లు, వికారాబాద్-కృష్ణా నూతన రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2,677 కోట్లు కేటాయించాలని.. చైన్నె-హైదరాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్లను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. శనివారం కేంద్ర బడ్జెట్ 2026-27 రూపకల్పనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహించిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. సెస్‌లు, సర్ ఛార్జీల పేరుతో కేంద్రం అధిక మొత్తంలో ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకుంటోందని, దీని వల్ల రాష్ట్రాలకు దక్కాల్సిన నిధులు అందడం లేదని అన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా దక్కాల్సి ఉండగా.. 30 శాతమే అందుతోందని చెప్పారు. ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుపై విధించే సర్‌ఛార్జీల ద్వారా సమకూరే రూ.1.55 లక్షల కోట్ల(2025-26 అంచనా)ను మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు గ్రాంట్లుగా ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రాల, ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయంలో 20 శాతానికి పైగా ఖర్చు చేస్తోందని, దాన్ని 25 శాతం తగ్గించుకుంటే ఏటా రూ.2.21 లక్షల కోట్లు ఆదా అవుతాయని, ఈ మొత్తాన్ని నిర్దిష్ట అవసరాల కోసం రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రాల ద్రవ్యలోటు పరిమితిని జీఎ్‌సడీపీలో కనీసం 4 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్య రంగాల కోసం సమీకరించే నిధులను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ రెండో దశ మెట్రో ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి వెంటనే ఆమోదం తెలపాలన్నారు. హైదరాబాద్‌లో ఐఐఎం, మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు మంజూరు చేయాలన్నారు. 119 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పాఠశాలలకు తోడ్పాటునందించాలని కోరారు.