Share News

మీ-సేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 06:00 AM

రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ..

మీ-సేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్‌

  • యూరియా లభ్యతను మరింత సరళతరం చేసిన ప్రభుత్వం

  • యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోలేని రైతులకు ఉపయోగం

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియాను పంపిణీ చేయడానికి రాష్ట్ర వ్యవసాయశాఖ యూరియా బుకింగ్‌ సేవను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీ-సేవ కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకోలేని రైతులకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఐటీ, పరిశ్రమలశాఖ, వ్యవసాయశాఖలతో మీసేవా కేంద్రాలను అధికారులు అనుసంధానం చేశారు. ఈమేరకు ఎలకా్ట్రనిక్‌ సర్వీస్‌ డెలివరీ (ఈఎస్‌డీ) మీ-సేవ కమిషనర్‌ వివరాలు వెల్లడించారు.


రైతులు ఏంచేయాలంటే...

  • రైతు తన పట్టాదారు పాస్‌పుస్తకం నెంబరుతో సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించాలి.

  • మీసేవ ఆపరేటర్‌ రైతు వివరాలను సేకరించి నమోదు చేస్తారు.

  • రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్‌ చేస్తారు.

  • రైతు నమోదుచేసిన మొబైల్‌ నెంబరుకు పంపిన ఓటీపీ ధ్రువీకరించిన తర్వాత వెంటనే బుకింగ్‌ ఐడీ వస్తుంది.

  • ఈ ఐడీ బుకింగ్‌ చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

  • బుకింగ్‌ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన డీలర్‌ వద్ద యూరియాను కొనుగోలు చేయాలి.

  • యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌, మీ ేసవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.

  • ఓటీపీ చూసుకోవటానికి రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబరును మనుగడలో ఉంచుకోవాలి.

  • సహాయం కోసం సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారులను, మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.


  • ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకోండి

  • కేంద్ర మంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ

రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సరిపడా ఎరువులను సరఫరా చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఏర్పడిన సరఫరా లోటును ఈనెలలో అదనపు కేటాయింపుల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఈ మేరకు ఆయనకు మంత్రి తుమ్మల బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగిందని, దీంతో ఎరువుల అవసరం కూడా పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కేంద్రం నుంచి డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల సరఫరాలో భారీలోటు ఏర్పడటంతో బఫర్‌ స్టాక్‌లు తగ్గిపోయి, రైతులకు సరఫరా చేయడంపై ఒత్తిడి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌) నుంచి ఉత్పత్తి అయ్యే యూరియాలో 90 శాతానికి పైగా తెలంగాణకే కేటాయించాలని మరోసారి కేంద్రాన్ని తుమ్మల కోరారు. అంతేకాకుండా ఆమోదించిన నెలవారీ ప్రణాళిక ప్రకారం సరఫరాలు నిరంతరాయంగా కొనసాగించేలా ఎరువుల కంపెనీలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 09 , 2026 | 06:01 AM