యాప్‌తో యూరియా బ్లాక్‌మార్కెట్ తగ్గింది
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:58 AM
యూరియాను నిజమైన రైతులకు మాత్రమే అందించి, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన యూరియా యాప్‌తో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం మానుకోవాలి.. యాప్ పనితీరు బాగుందని కేంద్రం నుంచీ ప్రశంసలు
దేశ వ్యాప్తంగా అమలులోకి తెచ్చేందుకూ సన్నాహాలు
ఈ ధర్నాలు, ఆందోళనలు రాజకీయ ప్రేరేపిత చర్యలే
30న ఖమ్మం జిల్లాలో పండుగలా రైతు ఆశీర్వాద సభ: తుమ్మల
హైదరాబాద్/ ఖమ్మం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యూరియాను నిజమైన రైతులకు మాత్రమే అందించి, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన యూరియా యాప్‌తో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతిపక్ష పార్టీలు రైతులతో రాజకీయం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని, యూరియా యాప్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు యూరియా యాప్ వాస్తవ పరిస్థితులపై ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ పనితీరు బాగుందని కేంద్రం సైతం ప్రశంసించిందని, ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. దీనిని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిపారు. గతంలో జిల్లా రైతుల వారీగా ఉన్న యాప్‌ను మండల స్థాయి స్టాక్ సూచిస్తూ రైతులకు అందేలా యాప్‌లో మార్పులు చేస్తామన్నారు. గత రబీలో 21.81 లక్షల మంది రైతులు 97.95 లక్షల యూరియా బస్తాలు బుకింగ్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే... ఈ సీజన్‌లో 11.71 లక్షల మంది రైతులు 38.62 లక్షల బస్తాల యూరియా బుక్ చేసుకున్నారని తెలిపారు. ఇందులో 34 లక్షల బస్తాలను రైతులు తీసుకున్నారని, యూరియా బుకింగ్ యాప్ విజయవంతంగా పనిచేస్తుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85.84 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిరుడు జూన్ చివరి నాటికి 1.80 లక్షల టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం జూన్ 24 నాటికి 1.91 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సాధారణంగా యూరియా వినియోగం జూన్ మూడో వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ప్రతిపక్ష నేతలు సృష్టిస్తున్న భయాందోళనతో రైతులు ముందస్తుగా 34 లక్షల బస్తాలు కొనుగోలుచేసి నిల్వ చేసుకున్నట్లు తెలిపారు. గతంలో సాగుచేయని వ్యక్తులు కొనుగోలుచేయడం, ఒకే వ్యక్తి పలుమార్లు తీసుకోవడం, బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, పరిశ్రమలకు దారి మళ్లించడం వంటి అక్రమాలు జరిగేవని తెలిపారు. ప్రస్తుతం యాప్ ద్వారా అర్హులైన రైతులకు మాత్రమే యూరియా అందుతోందని చెప్పారు. నిరక్షరాస్యులైన రైతులు ఫోన్ బుకింగ్, వలంటీర్ల సేవలు, మీ సేవ కేంద్రాల ద్వారా నమోదు ద్వారా యూరియాను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు అందుతుంటే, ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకుంటుంటే.. ఓడిపోయిన పార్టీలు, తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. యూరియా అంటే తెలియని వారు కూడా రైతుల పేర్లపై ఆందోళనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకటి, రెండు జిల్లాల్లోని నాలుగైదు సహకార సంఘాల పరిధిలో మాత్రమే ఎదురైన స్వల్ప సాంకేతిక సమస్యలను సాకుగా చూపించి రైతులను రెచ్చగొట్టేందుకు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం రాజకీయ ప్రేరేపిత చర్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్రాంతి పండుగలా ఈనెల 30న రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఇదే వేదిక నుంచి వానాకాలం పెట్టుబడి సాయంగా రూ.9వేల కోట్లను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారని ప్రకటించారు. రెండున్నర ఏళ్లలో రూ.లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన దేశంలో ఏకైక ప్రభుత్వం.. రేవంత్ ప్రభుత్వమని, అందుకే 30న నిర్వహించే సభకు రైతులే రైతు ఆశీర్వాద సభగా నామకరణం చేశారని తెలిపారు. రాబోయే రెండేళ్లలో తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్‌ను పెంచబోతున్నామని, ప్రతి ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.