టీవీవీపీ కొత్త కమిషనర్ ఎవరో?
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:27 AM
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) నూతన కమిషనర్‌గా ఎవరిని నియమిస్తారన్న అంశంపై వైద్యశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆదివారంతో ముగిసిన అజయ్‌కుమార్ పదవీకాలం
కొత్త కమిషనర్ ఎవరన్నదానిపై వైద్యశాఖలో ఉత్కంఠ
సీఎంవోకు ఫైలు.. ఒకటిరెండు రోజుల్లో నియామకం
సీనియర్లకే అవకాశం ఇవ్వాలంటున్న వైద్య సంఘాలు
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) నూతన కమిషనర్‌గా ఎవరిని నియమిస్తారన్న అంశంపై వైద్యశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుత కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. టీవీవీపీలో పదోన్నతులు చేపట్టకపోవటంతో రెండు జాయింట్ కమిషనర్ పోస్టులను రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి భర్తీ చేయలేదు. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ పోస్టులో ఎవరిని కూర్చోబెట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు టీవీవీపీని ఇటీవలే పూర్తిగా రద్దు చేసి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్‌గా మార్చారు. దీనిపై పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల కావాల్సి వుంది. డీఎ్‌సహెచ్‌ఎ్‌సకు పూర్తిస్థాయి డైరెక్టర్ రావటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పటివరకు టీవీవీపీ ఇన్‌చార్జిలతోనే నెట్టుకొచ్చే అవకాశం ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. టీవీవీపీ తదుపరి ఇన్‌చార్జి కమిషనర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా వైద్యశాఖ సీఎం కార్యాలయానికి ఫైల్‌ను పంపింది. టీవీవీపీలోని సీనియర్ వైద్యులకే ఇన్‌చార్జి కమిషనర్ పోస్టును ఇవ్వాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఇన్‌చార్జి కమిషనర్‌ను నియమించే అవకాశం ఉందని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
వైద్యవిద్యలో 26 మందికి పదవీ విరమణ..
వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయం పరిఽధిలో ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 26 మంది పదవీవిరమణ చేయబోతున్నారు. అందులో ఏడుగురు అదనపు డీఎంఈ హోదాలో ఉన్నారు. అకడమిక్ డీఎంఈ డాక్టర్ శివరాంప్రసాద్, యాదాద్రి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, టిమ్స్ సనత్‌నగర్ ఇన్‌చార్జి మహబూబ్‌ఖాన్ జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. జూలైలో డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్ రిటైర్ అవుతారు. ఆ తర్వాత అడిషనల్ డీఎంఈలుగా ఉన్న డాక్టర్ రాజలింగం, కుత్బుల్లాపూర్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధ ఉన్నారు. మిగిలిన వారంతా సీనియర్ అధ్యాపకులు.