గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శం
ABN , Publish Date - May 31 , 2026 | 06:04 AM
తెలంగాణ గిరిజన గురుకులాలు 82 వేల మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
వీటిలో 82 వేల మందికి అత్యుత్తమ విద్య అందిస్తున్నాం
అకడమిక్ సక్సెస్ మీట్‌లో అడ్లూరి
విద్యలో నేడు గిరిజన ప్రాంతాలూ సత్తా చాటుతున్నాయి: మంత్రి సీతక్క
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గిరిజన గురుకులాలు 82 వేల మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఈ సంవత్సరం గురుకుల విద్యాలయాలు పదోతరగతిలో 98.86 శాతం, ఇంటర్మీడియట్‌లో 86.53 శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా గురుకులాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. ‘అకడమిక్ సక్సెస్ మీట్ 2026: జనజాతీయ గరిమ ఉత్సవ్’ పేరుతో గిరిజన గురుకులాలు, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఈఎంఆర్‌ఎస్, ఆశ్రమ పాఠశాలల వార్షిక విజయోత్సవ సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై చేస్తున్న ఖర్చును భవిష్యత్ తరాలపై చేేస విలువైన పెట్టుబడిగా చూస్తోందని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో గిరిజన బాలికల కోసం ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు సమగ్ర విద్య అందించే సైనిక్ స్కూల్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గురుకులాల్లో పనిచేస్తున్న 1,185 మంది పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాల పెంపుతోపాటు, ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లకు రూ.5 వేల ప్రత్యేక గౌరవ వేతనం, వైస్ ప్రిన్సిపాళ్లు, డిప్యూటీ వార్డెన్ల భత్యాల పెంపునకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు రూ.1.30 కోట్లతో ‘అనీమియా ముక్త్ భారత్’ కార్యక్రమాన్ని, ఐఐసీటీ భాగస్వామ్యంతో రీసెర్చ్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పదోతరగతి, ఇంటర్, జేఈఈ, నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను నగదు పురస్కారాలు, మెమెంటోలతో సన్మానించారు. విద్యే ప్రపంచాన్ని మార్చే ఆయుధమని మంత్రి సీతక్క అన్నారు. ఒకప్పుడు గిరిజన ప్రాంతాలు అక్షరాస్యతలో వెనుకబడి ఉండేవని, నేడు పదోతరగతిలో ఈ ఏడాది ములుగు జిల్లా 99.3ు ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం ఆదివాసీ బిడ్డగా గర్వంగా ఉందన్నారు.