Share News

‘ట్రెజరీ’లో ఐదేళ్లుగా పదోన్నతులకు బ్రేక్‌

ABN , Publish Date - May 17 , 2026 | 05:39 AM

రాష్ట్ర ఆర్థికశాఖ పరిధిలోని ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టరేట్‌(డీటీఏ) కింద పనిచేస్తున్న అధికారులకు ఐదేళ్లుగా పదోన్నతులు లేవు.

‘ట్రెజరీ’లో ఐదేళ్లుగా పదోన్నతులకు బ్రేక్‌

  • న్యాయశాఖ తిరస్కరించినా.. ‘20 సైకిల్‌’తోనే ఫైలు

  • ఆందోళనలో అధికారులు, సీఎస్‍ను కలిసి వినతిపత్రం

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థికశాఖ పరిధిలోని ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టరేట్‌(డీటీఏ) కింద పనిచేస్తున్న అధికారులకు ఐదేళ్లుగా పదోన్నతులు లేవు. ఇతర శాఖల్లో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ సాగుతున్నా.. తాము మాత్రం పదోన్నతులకు నోచుకోక వేతనాలు పెరగడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఆర్థికశాఖ నిర్లక్ష్యం, నిబంధనలను ఖరారు చేయడంలో చూపిస్తున్న తాత్సారమే దీనికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. జిల్లాస్థాయిలో పనిచేసే సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌(ఎ్‌సటీవో), డైరెక్టరేట్‌లో పనిచేసే జూనియర్‌అకౌంట్స్‌ ఆఫీసర్‌(జేఏవో)లకు.. అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌(ఏటీవో), అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఏఏవో)లుగా పదోన్నతులు కల్పించాల్సిఉంది. ఇదివరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణలో ఉన్న ఒకే ఒక మూడో నెంబర్‌ మల్టీజోన్‌లో ‘20 పోస్టుల సైకిల్‌’ ఆధారంగా పదోన్నతులిచ్చేవారు. అంటే 14 పోస్టులను పదోన్నతుల ద్వారా, మిగతా 6 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేవారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో 2 మల్టీజోన్లను ఏర్పాటుచేశారు. ‘గెజిటెడ్‌ సర్వీస్‌ రూల్స్‌’ను సవరించి.. పాత ‘20 పోస్టుల సైకిల్‌’కు బదులుగా ఒక్కో మల్టీజోన్‌కు ‘10 పోస్టుల సైకిల్‌’ పద్ధతిని ప్రతిపాదిస్తూ డైరెక్టరేట్‌ ఫైలును తయారుచేసి ఆర్థికశాఖకు పంపింది. ట్రెజరీకి 5, అకౌంట్స్‌కు 2, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద 3 పోస్టులను ప్రతిపాదించింది. అయితే, డైరెక్టరేట్‌ పంపిన ఫైలుపై ఆర్థికశాఖ అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ.. ‘20 సైకిల్‌’ విధానంతోనే ఫైలును పంపగా న్యాయశాఖ తిరస్కరించింది. అయినా, ఆర్థికశాఖ మళ్లీ ‘20 సైకిల్‌’తోనే ఫైలు రూపొందించినట్లు తెలిసింది. దీనిపై అకౌంట్స్‌ విభాగం ఉద్యోగులు సీఎస్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఒక్కో మల్టీజోన్‌కు ‘20 సైకిల్‌’ విధానాన్ని అమలుచేస్తే.. 2 జోన్లకు కలిపి 40 పోస్టుల్లో పదోన్నతులివ్వడానికి 28 ఖాళీలు అందుబాటులో ఉండాలని, ఆ స్థాయిలో పోస్టు లు ఒకేసారి ఖాళీ కాబోవని వివరించారు. అదే ‘10 సైకిల్‌’ విధానాన్ని అమలుచేస్తే ఒక్కో జోన్‌కు ఏడేసి చొప్పున, 2 జోన్లకు కలిపి 14 ఖాళీలుంటే సరిపోతుందని విన్నవించారు.

Updated Date - May 17 , 2026 | 05:39 AM