Share News

రవాణా, భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:27 AM

ఇటీవల ఎన్‌హెచ్‌-44పై ఓ ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్‌కు చెందిన ఒకరికి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్తూ మధ్యలో...

రవాణా, భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు

  • వాహనం మూడు వైపులా అతికించాల్సిందే

  • రోడ్డు ప్రమాదాలకు రేడియం స్టిక్కర్లతో అడ్డుకట్ట!

  • కేంద్రం నిబంధనల మేరకు రాష్ట్రంలో పకడ్బందీగా అమలు

  • నాణ్యతా ప్రమాణాలున్నవే వాడాలి.. మే 20 వరకు గడువు

  • అవి ఉంటేనే ఇకపై ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఎన్‌హెచ్‌-44పై ఓ ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్‌కు చెందిన ఒకరికి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్తూ మధ్యలో రహదారిపై అంబులెన్స్‌ను ఆపారు. అదే రోడ్డు మీద వేగంగా వస్తున్న లారీ దాన్ని వెనకనుంచి ఢీ కొట్టింది. అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్‌, ఆయనకు తోడుగా ఉన్న భార్య ఇద్దరూ మృతి చెందారు. ఈ మధ్య ఇటువంటి ప్రమాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు మీద ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొనటం.. పలువురు ప్రాణాలు కోల్పోవటం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. ముందు నిలిచి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి వాహనం నడిపే డ్రైవర్‌ గుర్తించకపోవటం. ఈ తరహా ప్రమాదాల నివారణ కోసం కేంద్రం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర రవాణా శాఖ ‘రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్‌’ విధానాన్ని అమలు చేస్తోంది. కేంద్ర మోటారు వాహనాల నియమాలు, 1989లోని రూల్‌ 104 నుంచి 104(ఈ) ప్రకారం రవాణా, భారీ వాహనాలకు రిఫ్లెక్టివ్‌ టేపులు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్లు అమర్చడం తప్పనిసరి. కేంద్ర మార్గదర్శకాలకు లోబడి నాణ్యతా ప్రమాణాలతో రూపొందించిన, క్యూఆర్‌ ఆధారిత మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(ఎంఐఎస్‌) ద్వారా ధ్రువీకరణ పొందిన స్టిక్కర్లను మాత్రమే ఉపయోగించాలి. రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు ఉపయోగించడం వల్ల రాత్రి వేళ సుమారు కిలోమీటరు దూరం ఉన్న వాహనాన్ని సైతం వెనుక నుంచి వచ్చే వాహనదారులు సులువుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ నూతన విధానాన్ని రవాణా శాఖ అధికారులు గత ఫిబ్రవరి 20 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చారు. వాహనాలకు ఉన్న పాత స్టిక్కర్లు మార్చుకునేందుకు మే 20వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. కేవలం వెనకవైపే కాకుండా...మూడువైపులా నిర్దిష్ట కొలతల ప్రకారం స్టిక్కర్లు అంటించాల్సి ఉంటుంది. నాణ్యత లేని డూప్లికేట్‌ స్టిక్కర్లు కొన్ని నెలలకే మెరుపు లేకుండా వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితి ప్రమాదాలకు కారణమవుతోంది. దీన్ని నివారించటం కోసం ఈసారి 5 అంతర్జాతీయ కంపెనీలను స్టిక్కరింగ్‌ కోసం అధికారులు ఎంప్యానల్‌ చేశారు. ఈ ప్రమాణాలతో కూడిన స్టిక్కర్లను అతికించిన వాహనాలకే ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని నిర్ణయించారు.


అంతర్జాతీయ అధ్యయనాలు

భారీ ట్రక్కులకు రెట్రో రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లను అమర్చటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని థాయ్‌లాండ్‌, జపాన్‌ దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో తేలింది. ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ అండ్‌ సేఫ్టీ స్టడీస్‌ ప్రకారం.. వర్షాలు, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ స్టిక్కర్‌ల వాడకం వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గుతున్నాయని వెల్లడైంది.

ఏయే వాహనాలకు స్టిక్కర్లు?

లారీలు, ట్రాక్టర్లు, ట్రాక్టర్‌ ట్రాలీలు, పవర్‌ టిల్లర్లు, నిర్మాణరంగ సామాగ్రిని రవాణా చేసే వాహనాలు, మనుషులు, వస్తువులను రవాణా చేసే అన్ని వాణిజ్య అనుమతి ఉన్న వాహనాలు, సెవెన్‌ సీటర్‌ ఆటోలు, ఓమ్నిబ్‌సలు, మ్యాక్సిక్యాబ్‌లు, ఆటోలు, ఈ రిక్షాలకు రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

Updated Date - Apr 15 , 2026 | 04:27 AM