ప్రభుత్వం చెప్పినా పట్టించుకోరా!
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:40 AM
నిబంధనలు అతిక్రమించి ప్రమాదకరంగా తిరిగే వాణిజ్య వాహనాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోండి.. ఇదే విషయాన్ని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా పట్టించుకోరేం.
నిబంధనలు పాటించని
వాణిజ్య వాహనాలను సీజ్ చేయండి: మంత్రి పొన్నం
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : ‘నిబంధనలు అతిక్రమించి ప్రమాదకరంగా తిరిగే వాణిజ్య వాహనాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోండి.. ఇదే విషయాన్ని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా పట్టించుకోరేం..’’ అని రవాణా శాఖ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టవద్దని సూచించారు. రవాణా శాఖ పనితీరుపై సోమవారం ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. పరిమితికి మించి సరుకు రవాణా చేసే వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించనివి, ఫిట్‌నెస్‌లేని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైతే ఇలాంటి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఫిట్‌నెస్‌లేని స్కూల్ బస్సులు నడుపుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలన్నారు.