Share News

గ్లాస్‌ చాంబర్లు ఉన్న స్లీపర్‌ బస్సులపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:35 AM

ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిస్తూ గ్లాస్‌ డోర్‌తో కూడిన చాంబర్లు ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం మోపింది.

గ్లాస్‌ చాంబర్లు ఉన్న స్లీపర్‌ బస్సులపై ఉక్కుపాదం

  • రెండు రోజుల్లో 4 బస్సులను సీజ్‌ చేసిన రవాణా శాఖ

  • పర్మిట్లు ఇచ్చిన అరుణాచల్‌ప్రదేశ్‌ అధికారులకు నోటీసులు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిస్తూ గ్లాస్‌ డోర్‌తో కూడిన చాంబర్లు ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం మోపింది. రెండు రోజుల వ్యవధిలో 4 స్లీపర్‌ బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. ఈ వాహనాలన్నీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ అయినట్లు గుర్తించారు. ఈ మేరకు అరుణాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీలు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, పర్మిట్లు జారీ చేసిన అధికారులకు నోటీసులు పంపుతున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఒక రాష్ట్ర అధికారులు, మరో రాష్ట్ర అధికారులకు నోటీసులు జారీ చేయడం రవాణా శాఖ చరిత్రలో ఇదే మొదటిసారి అని సమాచారం. రోడ్డు ప్రమాదాలు లేదా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు గ్లాస్‌ చాంబర్ల కారణంగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడుతున్నారని అనేక అధ్యయనాల్లో తేలింది. స్లీపర్‌ బస్సుల నిర్మాణానికి సంబంధించి ఏఐఎస్‌-119, ఏఐఎస్‌-052 (బస్‌ బాడీ కోడ్‌) ప్రమాణాల ప్రకారం అత్యవసర నిష్క్రమణ మార్గాలు, రూఫ్‌ ఎస్కేప్‌ హ్యాచ్‌లు, ప్రయాణికులు నడిచేందుకు నిర్ణీత వెడల్పుతో గ్యాంగ్‌వే అందుబాటులో ఉండాలి. కానీ, గ్లాస్‌ చాంబర్ల కారణంగా ఈ ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెటుకొని తెలంగాణలో రిజిస్టర్‌ అయిన ప్రైవేటు స్లీపర్‌ బస్సులకు రవాణా శాఖ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. లోపాలను సరిదిద్దుకునేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో మూడు రోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో భాగంగానే కర్టెన్లు ఉండాల్సిన చోట గ్లాస్‌ డోర్లు ఏర్పాటు చేసిన 4 స్లీపర్‌ బస్సులను సీజ్‌ చేశారు. ఇందులో హైదరాబాద్‌ నుంచి రాజస్థాన్‌కు బయలుదేరిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును శుక్రవారం అర్ధరాత్రి సీజ్‌ చేయగా.. నిర్వాహకులు మరో బస్సు ఏర్పాటు చేయకపోవడంతో 40 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు తమ ప్రయాణన్ని రద్దు చేసుకోగా, మరికొందరు వేర్వేరు బస్సుల్లో 3-4 గంటల తర్వాత అక్కడ నుంచి బయలు దేరి వెళ్లారు. కాగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని, గాజు చాంబర్లు లేదా ఇతర అనధికారిక మార్పులతో నడుస్తున్న బస్సులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Updated Date - Jun 21 , 2026 | 04:35 AM