విద్యాసంస్థల వాహనాల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్!
ABN , Publish Date - May 21 , 2026 | 03:29 AM
విద్యార్థులను తరలించేందుకు విద్యా సంస్థలు ఉపయోగించే వాహనాల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు.
ఫిట్‌నెస్ లేని వాహనాలు, పరిమితికి మించి విద్యార్ధుల్ని తరలించే వాహనాలఫై దృష్టి
హైదరాబాద్, మే20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను తరలించేందుకు విద్యా సంస్థలు ఉపయోగించే వాహనాల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. ప్రమాదకరంగా మారిన విద్యాసంస్థల వాహనాలు, అధికారుల నిర్లక్ష్యంపై ‘స్టీరింగ్ తిప్పరు... గేరు మార్చరు..’, ‘28శాతం బస్సులకే ఫిట్‌నెస్..!’ శీర్షికలతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వరుస కథనాలకు రవాణా శాఖ అధికారులు స్పందించారు. విద్యా సంస్థల వాహనాల విషయంపై రవాణా శాఖ కమిషనర్.. సంబంధిత విభాగం అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. విద్యా సంస్థల వాహనాల ఫిట్‌నెస్ విషయంలో నిర్లక్ష్యం తగదని, నిబంధనలు పాటించని వాహన యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈమేరకు రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. అన్ని విద్యాసంస్థల బస్సులు, మినీ బస్సులు, టెంపోలు, ఓమిని, ఆటోలు, ఇతర వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కలిగి ఉన్నాయో? లేదో? తనిఖీ చేయనున్నారు. ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు, ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలలు పున:ప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులను పాఠశాలలకు చేరవేేస ప్రతి వాహనం ఫిట్‌నెస్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులను తరలించే (ఓవర్ లోడ్) వాహనాలలో తమ పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు.
రంగంలోకి విజిలెన్స్, ఏసీబీ..
విద్యాసంస్థల వాహనాల ఫిట్‌నెస్ విషయంలో అవినీతి ఆరోపణలపై విజిలెన్స్, ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. విద్యార్ధుల్ని తరలించే వాహనాల్లో ఫిట్‌నెస్ పొందిన వాహనాలెన్ని, వాటిని ఎక్కడ పరీక్షించారనే వివరాల్ని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కొన్ని విద్యాసంస్థలకు సంబంధించిన వాహనాలు రవాణా శాఖ కార్యాలయాల వద్దకు రాకుండానే ఫిట్‌నెస్ పొందినట్లు తెలిసింది. ఈ విషయాలపైనా విజిలెన్స్, ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. విద్యాసంస్థలు పునః ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున వాహనాలు ఫిట్‌నె్‌సకు వచ్చే అవకాశం ఉండటంతో ఆ సమయంలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.