ఆగ్రోస్ భూమి.. గిడ్డంగుల సంస్థకు బదిలీ
ABN , Publish Date - May 20 , 2026 | 03:29 AM
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(ఆగ్రోస్) పరిధిలో హైదరాబాద్ మౌలాలిలో ఉన్న 23 ఎకరాల భూమిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ...
23 ఎకరాల్లో గోదాములు నిర్మించాలని నిర్ణయం
మంత్రి తుమ్మల సమక్షంలో అవగాహన ఒప్పందం
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(ఆగ్రోస్) పరిధిలో హైదరాబాద్ మౌలాలిలో ఉన్న 23 ఎకరాల భూమిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ(వేర్ హౌసింగ్ కార్పొరేషన్)కు బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆగ్రోస్ ఎండీ కావేటి రాములు, గిడ్డంగుల సంస్థ ఎండీ కొర్ర లక్ష్మి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆగ్రోస్ నుంచి గిడ్డంగుల సంస్థకు బదిలీ చేసిన 23 ఎకరాల స్థలంలో 85 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 15 నెలల వ్యవధిలో గోదాముల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.