Share News

సౌర విద్యుత్తుతోనే పంపింగ్‌ చేయండి

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:24 AM

రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల పంపులన్నింటినీ గరిష్ఠంగా పగటిపూటే నడిపించాలని.. అందులోనూ సౌరవిద్యుత్‌ అందుబాటులో ఉండే వేళల్లోనే పంపింగ్‌ చేయాలని నీటిపారుదలశాఖను తెలంగాణ ట్రాన్స్‌కో కోరింది.

సౌర విద్యుత్తుతోనే పంపింగ్‌ చేయండి

  • నీటిపారుదల శాఖకు తెలంగాణ ట్రాన్స్‌కో లేఖ

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల పంపులన్నింటినీ గరిష్ఠంగా పగటిపూటే నడిపించాలని.. అందులోనూ సౌరవిద్యుత్‌ అందుబాటులో ఉండే వేళల్లోనే పంపింగ్‌ చేయాలని నీటిపారుదలశాఖను తెలంగాణ ట్రాన్స్‌కో కోరింది. దీనివల్ల ఆర్థికభారం తగ్గుతుందని, ఆమేరకు సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని సూచించింది. దేవాదుల ఎత్తిపోతల పథకం దేవన్నపేట పంప్‌హౌస్‌లో 62 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు పంపులను 24 గంటల పాటు నడిపేందుకు వీలుగా.. విద్యుత్‌ సరఫరా చేయాలంటూ నీటిపారుదలశాఖ రాసిన లేఖకు ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజనీర్‌(ఎత్తిపోతల పథకాలు) బదులిస్తూ.. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ(జనరల్‌)కు ఈ లేఖ రాశారు. అయితే నీటిపారుదల శాఖ మాత్రం 24 గంటల పాటూ కరెంట్‌ కోరుతోంది. ఇలా అందించాలంటే బహిరంగవిపణిలో విద్యుత్‌ను అత్యధికధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. తద్వారా విద్యుత్‌సంస్థలపై తీవ్ర ఆర్థికభారం పడుతుందన్నారు. అందువల్ల ఎత్తిపోతల పథకాలకు పగటిపూట మాత్రమే కరెంట్‌ తీసుకోవాలని, సౌరవిద్యుత్‌ లభ్యత ఉండటంతో తక్కువ ధరకు లభిస్తుందన్నారు. ఇక భారీగా పేరుకుపోయిన విద్యుత్తు బిల్లుల బకాయిలు, నిర్మాణ పనుల కింద రూ.33,653 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. అత్యవసరంగా రూ.500 కోట్లను విడుదల చేయాలని నీటిపారుదల శాఖను కోరారు.

Updated Date - Mar 28 , 2026 | 05:24 AM