తల్లి మృతితో తల్లడిల్లి 12గంటల్లో కొడుకు మృతి
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:09 AM
తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ కుమారుడు 12 గంటల వ్యవధిలోనే చనిపోయాడు. హనుమకొండ జిల్లాలో ఈ విషాదం నెలకొంది. ఐనవోలుకు చెందిన నర్సయ్య గ్రామ పంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తూ..
ఐనవోలు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ కుమారుడు 12 గంటల వ్యవధిలోనే చనిపోయాడు. హనుమకొండ జిల్లాలో ఈ విషాదం నెలకొంది. ఐనవోలుకు చెందిన నర్సయ్య గ్రామ పంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తూ గతంలోనే మృతి చెందాడు. ఆయన స్థానంలో భార్య మల్లికాంబ(68) కార్మికురాలిగా పనిచేసేది. ఆమెకు వయసు మీద పడటంతో చిన్న కుమారుడు రవి పంచాయతీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. మల్లికాంబకు గతంలో కాలికి శస్త్రచికిత్స చేసి రాడ్ వేశారు. ఇటీవల ఆ కాలుకు ఇన్ఫెక్షన్ ఏర్పడగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు ఆ కాలును తొలగించారు. గురువారం రాత్రి ఆమె ఆస్పత్రిలోనే మృతి చెందింది. కుమారుడు రవి (38) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. తల్లి మృతి చెందిన విషయం తెలియగానే ఆందోళనకు గురై శుక్రవారం ఉదయం గుండె ఆగిమృతి చెందాడు. మల్లికాంబ అంత్యకియలు పూర్తిచేసిన బంధువులు ఇంటికొచ్చి రవిని విగతజీవిగా పడిఉండటం చూసి బోరున విలపించారు. అనంతరం రవి అంత్యక్రియలు పూర్తి చేశారు.