18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు
ABN , Publish Date - May 16 , 2026 | 04:41 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ...
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహణ: జూపల్లి
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను సచివాలయంలో మంత్రి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయన్నారు. రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ సంపద, సంస్కృతి, ఎకో-టూరిజం ప్రదేశాలను ప్రమోట్ చేయడంతోపాటు పర్యాటక రంగం ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు.రాష్ట్రంలో పర్యాటక రంగానికి తిరుగులేని ఆదరణ ఉందని మంత్రి తెలిపారు. మౌలిక వసతుల కల్పన, వారసత్వ సంపద పరిరక్షణ, సాంస్కృతిక పర్యాటక ప్రచారం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని సమీకృతంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు.