పర్యాటక రంగానికి ‘డిజిటల్’ బూస్టర్
ABN , Publish Date - May 22 , 2026 | 04:21 AM
పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఉపయోగపడే శక్తిమంతమైన సాధనమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు....
త్వరలో ‘ప్రభాత భేరి’ సామాజిక చైతన్య కార్యక్రమం
పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి జూపల్లి
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఉపయోగపడే శక్తిమంతమైన సాధనమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. డిజిటల్ వేదికల్లో తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పర్యాటక వారోత్సవాల సందర్భంగా బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ‘తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశం’లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇచ్చిన సలహాలు సూచనలు స్వీకరించి పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నూతన మెటా ఖాతా, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, హస్తకళలు, చేనేత, కలంకారీ కళా వైభవాన్ని ప్రతిబింబించే ‘టైమ్‌లెస్ తెలంగాణ’ వీడియోను ప్రదర్శించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కేవలం పర్యాటక ప్రమోషన్‌కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో క్రియేటర్లు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే టూరిజం క్రియేటర్లకు ప్రభుత్వం తరపున అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు.