Share News

మోదీ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు!

ABN , Publish Date - May 09 , 2026 | 06:01 AM

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు ప్రధాని మోదీ పర్యటన అంకురార్పణ చేయబోతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆయన పర్యటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని అంటున్నారు

మోదీ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు!

  • 2, 3 నెలల్లోనే మార్పులు చూస్తారు

  • తెలంగాణలో బెంగాల్‌ జోష్‌ కొనసాగిస్తాం

  • బీజేపీ నేతల వ్యాఖ్యలు..

  • రేపు పరేడ్‌గ్రౌండ్‌లో మోదీ సభ

  • రాష్ట్రానికి మోదీ రూ.8 వేల కోట్ల అభివృద్ధి కానుక: రాంచందర్‌రావు

  • మోదీ సభను విజయవంతం చేయండి

  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

  • మోదీతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్‌

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు ప్రధాని మోదీ పర్యటన అంకురార్పణ చేయబోతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆయన పర్యటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని అంటున్నారు. అది కూడా రెండుమూడు నెలల్లోనే జరగబోతోందని పేర్కొంటున్నారు. వ్యూహాత్మకంగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో మోదీ బహిరంగసభను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. బెంగాల్‌లో పార్టీ విజయబావుటా ఎగురవేయబోతున్నట్లు స్పష్టత వచ్చిన రోజే తెలంగాణలో సభను ఖరారు చేసినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. అస్సాం, బెంగాల్‌లో సాధించిన విజయ పరంపరను తెలంగాణలో కొనసాగించేందుకు అంతర్గత కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అనుసరించబోయే కార్యాచరణలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ దశలవారీగా పర్యటించబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌తో పాటు పార్టీ అగ్రనాయకులు విస్తృత పర్యటనలు చేయబోతున్నారు. ఇక్కడ పార్టీ కార్యక్రమాలను అగ్రనాయకులు స్వయంగా పర్యవేక్షించనున్నారు’ అని పార్టీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే సభలో ప్రధాని పాల్గొంటారు.


8 వేల కోట్ల పనులకు ప్రారంభం

ప్రధాని మోదీ రాష్ట్రంలో దాదాపు రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు. హెచ్‌ఐసీసీలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచే జహీరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌సిటీ, ఎన్‌హెచ్‌-167 (గూడబల్లేరు-మహబూబ్‌నగర్‌) విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్‌ పార్కు (వరంగల్‌)తో పాటు మల్కాపూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రో టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాక్‌ ప్రాజెక్టు (118 కి.మీ.), కాజీపేట ఆర్‌యూబీ బైపాస్‌ లైన్‌ (21 కి.మీ.లు)ను జాతికి అంకితం చేస్తారు. ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా తాము తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ను 150 మీటర్ల ఎత్తులో నిర్మించుకొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధానికి సీఎం వినతిపత్రం అందించే అవకాశం ఉందని సమాచారం.


మోదీ సభకు భారీ ప్రచారం

ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరాన్ని వాల్‌రైటింగ్స్‌, వాల్‌పోస్టర్లు, హోర్డింగులతో నింపేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిరి జిల్లాల నుంచి భారీగా జనాన్ని తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు, ఎంపీలు డాక్టర్‌ లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌ తదితర నేతలు నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌ నుంచి అమీర్‌పేట వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 10 వేల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ప్రజల్లోనూ బీజేపీకి అధికారం కట్టబెట్టాలనే సంకల్పం కనిపిస్తోందని తెలిపారు. మోదీ సభకు సుమారు 2 లక్షల మంది వస్తారని చెప్పారు. కిషన్‌ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌లో సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని సభను జయప్రదం చేయాలని కోరారు. ప్రధాని సభకు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మల్కాజిగిరి కమీషనరేట్‌ పరిధిలోని డీసీపీ శ్రీధర్‌ తెలిపారు. నగరంతోపాటు సభా ప్రాంగణం ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Updated Date - May 09 , 2026 | 06:03 AM