Share News

27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలు

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:18 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలను అందించాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలు

  • పాడి రైతుల బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించాలి

  • పాల ఉత్పత్తి, పశువుల సంఖ్యపై నివేదిక ఇవ్వండి: భట్టి

  • పాడి రైతులను ప్రోత్సహించాలి: వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలను అందించాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేసినట్లవుతుదని అన్నారు. భట్టి ఆధ్వర్యంలో శనివారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని మొత్తం పాల ఉత్పత్తి, పాలిచ్చే పశువుల సంఖ్య తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పాల సేకరణకు సంబంధించి పాడి రైతులకు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవసరాలకు తగినంత పాల ఉత్పత్తి జరగడం లేదని, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే పాడి రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jun 21 , 2026 | 05:18 AM