సబ్ స్టేషన్ల పక్కనే సౌర విద్యుత్ ప్లాంట్లు
ABN , Publish Date - May 02 , 2026 | 05:13 AM
రాష్ట్రంలో సబ్ స్టేషన్ల పక్కన ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నచోట సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
భూమి ఉన్నచోట ప్లాన్ చేయండి
పైలట్ ప్రాజెక్టుగా 9 ఉమ్మడి జిల్లాల్లో 18 ప్లాంట్లు
దరఖాస్తు సీనియారిటీ ప్రకారం అనుమతులు
డేటా సెంటర్లకు అనుమతులు సాధించండి
వాటికి అవసరమైన లైన్లు వెంటనే వేయండి
విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సబ్ స్టేషన్ల పక్కన ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నచోట సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రయోగాత్మకంగా మొదట ఉమ్మడి జిల్లాకు రెండు చొప్పున 9 జిల్లాల్లో 18 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికోసం ఆయా జిల్లాల్లో నోడల్ అధికారులను నియమించాలన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖపై సమీక్ష నిర్వహించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, విద్యుత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హరిత ఇంధన విధానంలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టడానికి ముందుకొచ్చిన వారికి ప్రాధాన్యక్రమంలో అనుమతులు ఇవ్వాలన్నారు. సోలార్ స్టవ్‌ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్లపై మహిళా స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అందుకు అవసరమైన అనుమతులు సాధించాలని అధికారులను ఆదేశించారు. డేటా సెంటర్లు ఏర్పాటు చేసే ప్రాంతానికి ప్రత్యేక లైన్లు వేయాలన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, త్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని సీఎం చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్ సరఫరా కోసం అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. వేసవి డిమాండ్ కారణంగా ట్రాన్‌ఫార్మర్లపై ఓవర్ లోడ్ పడకుండా చూసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ రైతు పవర్ డిస్కమ్‌లో ఉద్యోగులు, సిబ్బంది చేరికపై ఉన్న అపోహలు తొలగించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో లోపాలు దిద్దుకొని, మెరుగైన విద్యుత్ సరఫరాను సాధించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు.