Share News

అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలివ్వండి

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:59 AM

అన్ని జిల్లాల్లో అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంక్షేమ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలివ్వండి

  • సంక్షేమ శాఖలపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): అన్ని జిల్లాల్లో అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంక్షేమ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రతిపాదిత ఈవీ స్కూటర్ల పథకంపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలపై గురువారం సచివాలయంలో ఆయన నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... ప్రైవేటు భవనాల్లో కొనసాగుతోన్న ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులను యంగ్‌ ఇండియా గురుకులాలకు మార్చే అవకాశాలను పరిశీలించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో మరమ్మతులను నెలలోపు పూర్తి చేయాలన్నారు. 2023 నుంచి బకాయి ఉన్న రూ.7.5 కోట్ల మరమ్మతు బిల్లులను ప్రాధాన్య క్రమంలో చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. విద్యార్థులకు సంబంధించిన బిల్లులను ఆర్థిక శాఖకు సకాలంలో పంపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సంక్షేమ శాఖలకు సంబంధించిన పెండింగ్‌లోని అన్ని బిల్లులను సమర్పించాలన్నారు.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న ప్రారంభించడమే లక్ష్యంగా బహుళ అంతస్తుల అంబేద్కర్‌ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 04:59 AM