ఏప్రిల్- మేలో రాష్ట్రంలో ఎస్‌ఐఆర్
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:29 AM
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తెలంగాణలో ఏప్రిల్- మేలో చేపట్టే అవకాశం ఉందని చీఫ్ ఎలక్టోరల్...
నోటిఫికేషన్‌కు ముందే బీఎల్‌ఏలను నియమించండి
పార్టీలకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తెలంగాణలో ఏప్రిల్- మేలో చేపట్టే అవకాశం ఉందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ వచ్చాక సమయం తక్కువగా ఉంటుందని, అందుకే ముందస్తు సన్నాహకాల్లో భాగంగా 2025 ఓటర్ల జాబితాను 2002 ఎస్‌ఐఆర్ ఓటర్లతో అనుసంధానించే ‘టేబుల్ టాప్ మ్యాపింగ్’ పూర్తి చేశామని చెప్పారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. డూప్లికేట్‌లు, తప్పుల్లేకుండా కచ్చితమైన ఓటరు జాబితా సిద్ధం చేయాలంటే బూత్‌స్థాయిలో పటిష్టమైన నిఘా అవసరమని, రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ ేస్టషన్‌కు ఒక బూత్‌లెవల్ ఏజెంట్‌ను(బీఎల్‌ఏ) రాజకీయ పార్టీలు తక్షణమే నియమించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ సమయంలో బీఎల్‌ఓలు ప్రతి ప్రాంతాన్ని 3 లేదా 4 సార్లు సందర్శిస్తారని, మొదటి విడతలో ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, అందుబాటులో లేని కుటుంబాల కోసం తదుపరి సందర్శనలు ఉంటాయన్నారు. సన్నాహక దశలో పేరు నమోదు కానివారు కూడా ఎస్‌ఐఆర్ సమయంలో వివరాలు సమర్పించవచ్చని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.