పెట్రోల్, డీజిల్ ఆటోలు ఈవీలుగా మార్పు
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:21 AM
పర్యావరణ హిత రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూ, ఉద్గారాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్....
రెట్రోఫిట్‌మెంట్ సంస్థలతో రవాణా శాఖ అధికారుల భేటీ
పర్యావరణ హిత రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూ, ఉద్గారాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీ క్యూర్) పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆటోల ఎలక్ర్టిక్ రెట్రోఫిట్‌మెంట్ సంస్థలతో సోమవారం రెండు దశల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు రవాణా కమిషనర్ ఇలంబర్తి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల్లో సాంకేతిక ప్రమాణాలు, భద్రతా నిబంధనలు, సర్టిఫికేషన్ ప్రక్రియ, వ్యయ నిర్మాణం, బ్యాటరీ సాంకేతికతలు (స్వాపబుల్, ఫిక్స్‌డ్ బ్యాటరీ వ్యవస్థలు) అమలు విధానాలపై పూర్తిస్థాయిలో చర్చించారు. ప్రస్తుతం ఉన్న ఆటోలను ఎలక్ర్టిక్ వాహనాలుగా మార్చడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై రెట్రోఫిట్‌మెంట్ సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చడం వల్ల వాయు కాలుష్యం, ఆటో డ్రైవర్లకు ఆపరేటింగ్ ఖర్చులు తగ్గడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. రెట్రోఫిట్‌మెంట్ సంస్థల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించి, సాధ్యమైన వాటిని విధాన రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.