Share News

22 నుంచి యాసంగి రైతు భరోసా

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:46 AM

రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి ‘రైతు భరోసా’పై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి....

22 నుంచి యాసంగి రైతు భరోసా

  • 3 విడతల్లో 9వేల కోట్ల నగదు బదిలీకి ప్రభుత్వ నిర్ణయం.. ఎకరానికి రూ.6వేలు చొప్పున పెట్టుబడి సాయం

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి ‘రైతు భరోసా’పై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా కింద మూడు విడతల్లో మొత్తం రూ.9వేల కోట్ల నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించిన అనంతరం రైతు భరోసా నగదు బదిలీ షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్‌ ప్రారంభిస్తున్నారు. అదే రోజున రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు.

మూడు విడతలు.. రూ.9,000కోట్లు

రైతు భరోసా నిధుల బదిలీని ప్రభుత్వం మూడు విడతలుగా చేయనుంది. తొలి విడతగా ఈ నెల 22 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకిరూ.3,590 కోట్ల నగదు బదిలీ చేయనున్నారు. మొదటి రోజు ఒక ఎకరం భూ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ చేస్తారు. అనంతరం మూడు వారాల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు జమ చేయనుంది. ఏప్రి ల్‌ నెలాఖరులోపు మూడో విడతగా మిగిలిన రూ.2,760 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కాగా, రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రైతుల తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ప్రభుత్వమని మరోసారి రుజువైందని తుమ్మల పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎస్‌ రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ పాల్గొన్నారు.


ఎలాంటి కోతలు లేకుండానే..

ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఎలాంటి కోత లు, షరతులు లేకుండానే అమలు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి ఎకరానికి రూ.6 వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధమవుతోంది. ఐదెకరాలు, పదెకరాల వరకు పరిమితులు విధిస్తారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిమితులు లేకుండా, వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న మొత్తం విస్తీర్ణానికి రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించటం గమనార్హం. సీసీఎల్‌ ఏ జాబితా, భూభారతి రికార్డులు, వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం మొత్తం సాగుభూములకు రైతు భరోసా చెల్లించే అవకాశాలున్నాయి.

రైతులకే తొలి ప్రాధాన్యం

పథకాలు, పాత బకాయిల చెల్లింపులకు నిధులు సర్దుబాటు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి అతికష్టంగా మారింది. రైతుభరోసా ప్రకటనకు ముందు నిధుల సర్దుబాటుపై తీవ్ర చర్చ జరిగింది. రైతు భరోసా, ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు, కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులకు ప్రతి నెలా రూ.850 కోట్ల చొప్పున బకాయిలు చెల్లిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులకు కూడా యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ మూడు కూడా అత్యవసరమయ్యాయి. ఏది వాయిదా వేద్దాం? మొదట ఏ పథకానికి చెల్లింపులు చేద్దాం? అనే చర్చ జరిగింది. చివరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. దీంతో యాసంగి రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమం అయ్యింది.

Updated Date - Mar 16 , 2026 | 04:46 AM