Share News

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో వాతావరణ సవాళ్లను అధిగమిస్తాం: తుమ్మల

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:01 AM

రాబోయే వాతావరణ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ.. ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను రూపొందించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో వాతావరణ సవాళ్లను అధిగమిస్తాం: తుమ్మల

ఖమ్మం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాబోయే వాతావరణ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ.. ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను రూపొందించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎల్‌నినో కారణంగా వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ సంస్థలు పేర్కొన్న దృష్ట్యా.. వానాకాలం సాగులో ముందు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నైరుతి రుతుపవనాల వల్ల కురిసే వర్షాలను పరిగణనలో ఉంచుకుని రైతులు సాగుపై దృష్టి సారించాలని కోరారు. ముందుగానే పచ్చిరొట్ట, ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలు తీసుకోవడం లేదని, అలాగే ఎరువులు, డీజిల్‌ సక్రమంగా అందించడం లేదని ఆరోపించారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా.. ఉద్యానపంటలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుచేసే రైతులకు కొంత ప్రోత్సాహం అందిస్తామన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 06:01 AM