Share News

ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వస్తూ..తప్పుడు చిరునామా ఇస్తే కేసు

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:43 AM

ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రంలో ఎక్కడ ఉంటారన్న విషయాన్ని దాచిపెట్టాలని చూసినా, తప్పుడు చిరునామా గానీ...

ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వస్తూ..తప్పుడు చిరునామా ఇస్తే కేసు

  • ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో సర్కారు నిర్ణయం

  • ప్రయాణికులకు ఈ విషయాన్ని తెలపాలి

  • అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి) : ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రంలో ఎక్కడ ఉంటారన్న విషయాన్ని దాచిపెట్టాలని చూసినా, తప్పుడు చిరునామా గానీ, తప్పుడు ఫోన్‌ నంబర్‌ గానీ ఇచ్చినా తీవ్రంగా పరిగణించాలని, ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ సహా వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఎబోలా వ్యాప్తి దృష్ట్యా సచివాలయంలో సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ దేశాల్లో ఎబోలా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఆ దేశాల నుంచి ఇక్కడి వచ్చిన వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. నివాసం విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే.. కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని విమానాశ్రయంలోనే ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలని మంత్రి సూచించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇప్పటికే స్ర్కీనింగ్‌ వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచుతున్నామన్నారు. ఇప్పటివరకూ ఇద్దరు అనుమానితుల శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించగా.. నెగిటివ్‌ వచ్చిందన్నారు. ఐసీఎంఆర్‌ సూచన మేరకు వారి శాంపిల్స్‌ను మరోసారి సేకరించి.. పరీక్షలకు పంపించాలని సూచించారు. అనుమానితుల నుంచి సాంపిల్స్‌ సేకరణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఆదేశించారు.

మంత్రి దామోదరతో నిమ్స్‌ డైరెక్టర్‌ రాహుల్‌ భేటీ

నిమ్స్‌ డైరెక్టర్‌గా నియమితులైన డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ మంత్రి దామోదర రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించడంలో నిమ్స్‌ను ముందంజలో నిలపాలని సూచించారు.

Updated Date - Jun 09 , 2026 | 04:43 AM