ఈ ఏడాది మరో 5 ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:08 AM
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద 150 స్టాళ్లతో రైతు ఉత్సవ మేళా ప్రారంభమైంది.
నర్మెట్ట రైతు ఉత్సవ మేళాలో మంత్రి తుమ్మల వెల్లడి
సిద్దిపేట/నంగునూరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద 150 స్టాళ్లతో రైతు ఉత్సవ మేళా ప్రారంభమైంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ రఘునందన్‌రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ మేళాను ప్రారంభించారు. ఈ నెల 22న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. మేళాలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాదిలో మరో 5 ఆయిల్ పామ్ ప్యాక్టరీలు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు తన తోటలో ఆయిల్ పామ్ సాగు చూసి రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేయాలనే ఆలోచన చేశారని గుర్తుచేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడానికి తుమ్మల నాగేశ్వరరావు స్ఫూర్తి అని తెలిపారు. మేళా సందర్భంగా రైతు సమస్యలపై మంత్రి తుమ్మలకు హరీశ్‌రావు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతుల సంఖ్య లక్షల్లో ఉందన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా పటిష్టమైన పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మేళా వద్ద కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేసుకోవడంతో ఇరువర్గాల నాయకులు నచ్చజెప్పాల్సి వచ్చింది. నినాదాలు చేస్తున్న వారిని వేదిక వద్ద నుంచి పోలీసులు తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగుతుందని, ఎవరూ రాజకీయాలు చేయవద్దని మంత్రులు సూచించడంతో కార్యకర్తలు శాంతించారు.