Share News

ఏప్రిల్‌ 1 నుంచి టీ-ఫైబర్‌ నెట్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:14 AM

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఏప్రిల్‌ 1 నుంచి టీ-ఫైబర్‌ నెట్‌

  • ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కారీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌.. అన్ని విభాగాలు తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం

  • ప్రస్తుత నెట్‌ వివరాలివ్వాలని ఆదేశం

  • విభాగాలవారీగా నోడల్‌ అధికారిని నియమించాలని సూచన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు చెందిన ‘టీ-ఫైబర్‌’ ఇంటర్నెట్‌ను అన్ని ప్రభుత్వ విభాగాల్లో వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, పాఠశాలలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రైవేటు ఇంటర్నెట్‌ స్థానంలో టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ను తీసుకోవాలని సూచించింది. విభాగాలవారీగా ప్రభుత్వ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకునేందుకు ఒక నోడల్‌ అధికారిని నియమించాలని ఆదేశించింది. అలాగే ప్రస్తుతం కార్యాలయాల్లో వినియోగిస్తున్న ప్రైవేటు ఇంటర్నెట్‌ కనెక్షన్లు, వాటికి చెల్లించే బిల్లుల వివరాలను ఈ నెల 12లోగా ప్రభుత్వానికి అందించాలని కోరింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి టీ- ఫైబర్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీలైతే మార్చి రెండు, మూడో వారం నుంచే ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌లు ఇవ్వనున్నారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ప్రైవేటు ఇంటర్నెట్‌ వాడటంవల్ల ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.450 కోట్ల వరకు భారం పడుతోంది. ఇదే విషయాన్ని ‘సర్కారీ ఇంటర్‌నెట్‌ను వాడేదెప్పుడు?’ శీర్షికన జనవరి 12న ‘ఆంధ్రజ్యోతి’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. పలు దఫాలుగా ఐటీశాఖ, టీ-ఫైబర్‌తో చర్చలు జరిపి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకోవాలని సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ సర్క్యులర్‌లో ఈ వార్తా కథనం గురించి కూడా ప్రస్తావించటం గమనార్హం.


లక్షకు పైగా ప్రభుత్వ కార్యాలయాలకు...

వాస్తవానికి రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థలు, అర్బన్‌/రూరల్‌, లోకల్‌ బాడీలు సహా ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలన్నీ ‘టీ-ఫైబర్‌’ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకోవాలని ఆదేశిస్తూ 2024 డిసెంబరు 8న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు కలిపి దాదాపు 1,86,547 విభాగాలకు టీ-ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకోవాలని గుర్తించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 424 మండలాలు, 8,895 గ్రామపంచాయతీల్లో పూర్తిస్థాయిలో ఎలాంటి అవాంతరం లేకుండా పనిచేసే విధంగా టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది. అలాగే దాదాపు 90 లక్షల గృహాలకు, లక్షకు పైగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు చిన్న తరహా పరిశ్రమలకు కలిపి ఇంటర్‌నెట్‌ అందించేంత సామర్ధ్యం తమకు ఉందని తాజాగా ఐటీశాఖ, టీ-ఫైబర్‌తో ప్రభుత్వం నిర్వహించిన సమావేశాల్లో సంబంధిత అధికారులు తెలిపారు. కానీ, రాష్ట్రంలో ఇప్పటివరకు 3,484 సంస్థలు మాత్రమే టీ-ఫైబర్‌ సేవలను వాడుతున్నాయి. కాగా, టీ-ఫైబర్‌ అందుబాటులో లేని ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో థర్డ్‌ పార్టీ సహాయం తీసుకొని అయినా సరే ఈ సంస్థ ద్వారానే ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

రూ.500 కోట్ల ఆదాయం!

టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం 2024లో జీవో జారీ చేసిన సమయంలోనే వన్‌టైమ్‌ చార్జీల కింద ఇంటర్నెట్‌ వేగాన్ని బట్టి రూ.9,500 చొప్పున ధర ఖరారు చేశారు. ఈ రెండేళ్లలో నెట్‌ వేగం, ధరల్లో మార్పులు చోటుచేసుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలు ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలకు చెల్లిస్తున్న ధరలు అందిన తరువాత టీ-ఫైబర్‌ కూడా ధరల్లో మార్పులు చేర్పులు చేయనుంది. 4 ఎంబీపీఎస్‌ నుంచి మొదలుకుని 100 ఎంబీీపీఎస్‌ స్పీడ్‌ వరకు ఎంతమేర చార్జీ వసూలు చేయాలన్నదానిపై ఇప్పటికే సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలు ఇంటర్నెట్‌ సేవల కోసం ప్రైవేటు సంస్థలకు ఏటా రూ.450 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్టు సమాచారం. ఇకపై టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌నే వాడితే ప్రస్తుతం వాడుతున్నసంస్థలతో కలిపి టీ-ఫైబర్‌కు దాదాపు రూ.500 కోట్ల ఆదాయం రానుందని సమాచారం.

Updated Date - Feb 10 , 2026 | 04:14 AM