‘బీమా’కు నేడు ఎంవోయూలు?
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:18 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అమలుచేయబోతోంది. ఒక్కో ఉద్యోగి, పెన్షనర్‌కు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు బీమా కవరేజీ వర్తించే.....
ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా
బ్యాంకులతో నేడు ఆర్థిక శాఖ ఒప్పందాలు చేసుకొనే చాన్స్
ఒప్పందాలు పూర్తయితే రేపటి నుంచే బీమా వర్తింపు
లేదంటే ఆగస్టు 1 నుంచి అమలు చేసే యోచన
ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే వర్తింపు
నేడు రవీంద్రభారతిలో పథకాన్ని ప్రారంభించనున్న రేవంత్
హైదరాబాద్/సిటీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అమలుచేయబోతోంది. ఒక్కో ఉద్యోగి, పెన్షనర్‌కు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు బీమా కవరేజీ వర్తించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉద్యోగుల సమక్షంలో ప్రారంభించనున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆర్థిక శాఖ బుధ వారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఉద్యోగుల తరఫున 14 బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకోనుంది. ఆర్థిక శాఖ, బ్యాంకుల మధ్య ఎంవోయూలు జరిగే అవకాశముందని తెలిపింది. ఒప్పందాలు పూర్తయితే శుక్రవారం (26న) నుంచే ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఒకవేళ 26 నుంచి అమలు కాకపోతే ఆగస్టు 1 నుంచి అమలయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది. కొన్ని బ్యాంకులు రూ.2-3 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయని పేర్కొంది. శాశ్వత, పాక్షిక అంగవైకల్యం వంటి సందర్భాల్లోనూ బీమా రక్షణ ఉంటుందని వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బీమా సంస్థలు ఉద్యోగులు, ప్రజలకు సహజ, ప్రమాద మరణ బీమాలతోపాటు ఆరోగ్య బీమా సదుపాయాలను కల్పిస్తున్నాయి. వీటి కోసం ప్రీమియం సొమ్మును వసూలు చేస్తుంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలన్నీ బ్యాంకుల్లో ఉంటాయి. ఎఫ్‌ఆర్‌బీఎం, ఇతర బ్యాంకుల నియంత్రణ చట్టాల ప్రకారం ఉద్యోగులకు బ్యాంకులు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలన్న నిబంధనలున్నాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు దీని గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అందుకే ఉద్యోగులకు బ్యాంకుల నుంచి ప్రమాద బీమా సదుపాయం అందలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బ్యాంకర్లతో పలుమార్లు చర్చలు జరిపి ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద బీమా వర్తింపజేయాలని ఒత్తిడి తేవటంతో 14 బ్యాంకులు అంగీకరించినట్లు వెల్లడించారు. ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండానే బ్యాంకులు బీమా సౌకర్యాన్ని కల్పిస్తాయని వివరించారు. యూనియన్ బ్యాంకు, ఎస్‌బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్‌డీఎ్‌ఫసీ, యస్ బ్యాంకు, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ బ్యాంకుల్లోనే ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన ఖాతాలున్నాయి. ఉద్యోగి ఖాతా ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకుతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంటుంది. ఉద్యోగి కావాలనుకుంటే బ్యాంకును మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. వేతనాల శ్రేణి ఆధారంగా ఈ కవరేజీలను బ్యాంకులు ప్రకటించాయి. కొన్ని బ్యాంకులు విమాన ప్రమాద బీమాను కూడా అందిస్తున్నాయి. ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తుండటంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హర్షం వ్యక్తంచేసింది. సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడంపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఐకాస చైర్మన్ పులి లక్ష్మయ్య సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీమా పథకం ప్రారంభోత్సవానికి ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలని టీజీవో హైదరాబాద్ జిల్లా అఽధ్యక్ష కార్యదర్శులు కృష్ణయాదవ్, మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ పిలుపునిచ్చారు.