భూమి కోల్పోయే వారికి..ఆ పక్కనే విలువైన స్థలం!
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:22 AM
ఏదైనా రోడ్డు కోసమో, ప్రాజెక్టు కోసమో భూసేకరణ మొదలుపెట్టగానే ఆందోళనలు మొదలవుతాయి. తాము నిండా మునిగిపోతామని బాధితుల నుంచి నిరసన వస్తుంది.
రోడ్లు, ప్రాజెక్టుల భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ యోచన
నష్ట పరిహారానికి బదులు అభివృద్ధి చేసిన స్థలం
భూమి కోల్పోయి నష్టపోయే బాధితులకు ఇకపై ఊరట
మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఇప్పటికే ఈ విధానం అమలు
రాష్ట్రంలో ‘ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవల్‌పమెంట్’ పేరిట ముసాయిదా చట్టం రూపకల్పనకు ఏర్పాట్లు
మార్గదర్శకాలు, నిబంధనల కోసం కన్సల్టెన్సీకి బాధ్యత
తొలుత గ్రేటర్‌లో ప్రారంభం.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా..
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఏదైనా రోడ్డు కోసమో, ప్రాజెక్టు కోసమో భూసేకరణ మొదలుపెట్టగానే ఆందోళనలు మొదలవుతాయి. తాము నిండా మునిగిపోతామని బాధితుల నుంచి నిరసన వస్తుంది. మరోవైపు ఆ రోడ్డు, ప్రాజెక్టు పక్కన భూముల వారికి మాత్రం.. ధరలు పెరిగి లాభం కలుగుతుంది. ఈ క్రమంలో అందరికీ ప్రయోజనం కలిగించేలా, నిర్వాసితులు తమంతట తామే ముందుకొచ్చి భూములిచ్చేలా రాష్ట్ర సర్కార్ ‘ల్యాండ్ పూలింగ్ పథకం’పై కసరత్తు చేస్తోంది. రోడ్లు, ప్రాజెక్టుల పరిసరాల్లో జరిగే అభివృద్ధిలో నిర్వాసిత ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా భూములు కోల్పోయేవారికి నష్టపరిహారానికి బదులు అక్కడే అభివృద్ధి చేసిన విలువైన స్థలాన్ని ఇచ్చేలా కొత్త విధానాన్ని రూపకల్పన చేస్తోంది. భూములు కోల్పోతున్నామన్న ఆందోళనలకు దీనితో చెక్‌పడుతుందని.. అభివృద్ధి చేసిన విలువైన స్థలంతో నిర్వాసితులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌లలో అమలవుతున్న ఈ తరహా పథకాలను పరిశీలించి.. ఇక్కడి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా, ప్రజలకు మరింత ప్రయోజనం కలిగించేలా ‘ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవల్‌పమెంట్ (ఎల్‌పీఏడీ)’ ముసాయిదాను రూపొందిస్తున్నట్టు వెల్లడించాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మల్లన్నసాగర్ తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం గ్రామాలను ఖాళీ చేయించిన సందర్భంలో రైతులు, ప్రజలు తిరగబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే రోడ్డు పనులు ప్రారంభించడంతో కొందరు పరిహారం తీసుకుని ఊరుకుంటే, మరికొందరు కోర్టులను ఆశ్రయించారు. రోడ్డు కోసం భూములు కోల్పోయినవారు ఆందోళనలో ఉంటే.. పరిసర ప్రాంతాల్లోని వారు మాత్రం భూముల విలువ పెరిగి, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయన్న ఆనందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భూములు కోల్పోయేవారు నిర్వాసితులుగా కాకుండా పరిసర ప్రాంతాల రైతుల మాదిరిగానే అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా కొత్త విధానం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ల్యాండ్ బ్యాంకుతో వేగంగా అభివృద్ధి
దేశంలోని పలు రాష్ట్రాలు, నగరాలకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ వరంగా మారింది. ప్రధానంగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ వేస్తే.. చాలా మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి, బదులుగా అభివృద్ధి చేసిన స్థలాన్ని తీసుకుంటున్నారు. దీనితో అక్కడ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో వేలాది ఎకరాలు సేకరించారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ భూ సమీకరణ పథకం అమలుకు మార్గదర్శకాలతో 2017లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హెచ్‌ఎండీఏ పరిధిలో మినహా రాష్ట్రంలో ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను అమలుచేయలేదు. హెచ్‌ఎండీఏలో కూడా ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్-2017లో ఉన్న నిబంధనలు ప్రభుత్వానికి, రైతులకు ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలో దానిని సవరించి.. రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణానికి, టౌన్‌షి్‌పల ఏర్పాటు కోసం సరళమైన నిబంధనలు, మార్గదర్శకాలతో ‘ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవల్‌పమెంట్’ ముసాయిదాను రూ పొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిబంధనలును రూపొందించడానికి హెచ్‌ఎండీయే ఇప్పటికే ఓ కన్సల్టెన్సీని నియమించింది. తొలుత హెచ్‌ఎండీఏ పరిధిలో, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అదనంగా భూమి సేకరించి.. అభివృద్ధి చేసి పంపిణీ!
కొత్త ల్యాండ్ పూలింగ్ విధానంలో.. రోడ్లు/ప్రాజెక్టులకు అవసరమైన భూమికన్నా ఎక్కువగా సేకరించి, మిగతా భూమిని నిర్వాసితులకు పంచుతారు. సాధారణంగా 100 అడుగుల వెడల్పు ఉండే రోడ్డు కోసం వంద నుంచి 120 అడుగుల వరకు వెడల్పుతో భూములు సేకరించి, పరిహారం అందజేస్తారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎప్పుడూ కూడా బహిరంగ మార్కెట్ స్థాయిలో ఉండదు, పైగా ఆ రోడ్డు, ప్రాజెక్టు కారణంగా చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీనితో భూములు కోల్పోయేవారు తీవ్రంగా నష్టపోయామన్న ఆందోళనలో మునిగిపోతారు. అదే కొత్త విధానంలో వంద అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం కోసం 500 అడుగుల వరకు వెడల్పుతో భూములను సమీకరిస్తారు. అందులో వంద అడుగుల వెడల్పుతో రోడ్డును నిర్మించి, ఇరువైపులా మిగిలిన 400 అడుగుల వెడల్పు స్థలంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తారు. నిర్వాసితులకు తాము కోల్పోయిన భూమిలో కనీసం 50శాతం నుంచి 60శాతం మేర స్థలాన్ని ఇస్తారు. అంటే రెండెకరాల భూమి కోల్పోయిన వారికి.. కనీసం ఎకరం వరకు అభివృద్ధి చెందిన స్థలం అందుతుంది. ఈ స్థలం విలువ అంతకుముందు కోల్పోయే భూమి కంటే చాలా ఎక్కువే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.