ఈ-క్యాబినెట్‌కు రూ.2 కోట్లతో సాఫ్ట్‌వేర్
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:41 AM
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇక నుంచి ‘ఈ-క్యాబినెట్’ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తరాఖండ్ కోసం అభివృద్ధి చేసిన ఎన్‌ఐసీ
మార్పులు చేసి తెలంగాణలో అమలుకు నిర్ణయం
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇక నుంచి ‘ఈ-క్యాబినెట్’ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ సమావేశాల నిర్వహణను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోకి తెచ్చేందుకు ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను వినియోగించనుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం ‘ఈ-క్యాబినెట్ సొల్యూషన్స్’ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోంది. దీనికి పలు మార్పులు చేసి తెలంగాణ మంత్రివర్గ సమావేశాలకు అనువుగా మార్చుకుని ఇక్కడ అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్‌కార్పొరేటెడ్(ఎన్‌ఐసీఎ్‌సఐ)తో చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎ్‌స)ను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సాఫ్ట్‌వేర్ కోసం దాదాపు రూ.2కోట్ల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర ఐటీ శాఖ అంచనావేసింది. ఇందులో భాగంగానే ఎన్‌ఐసీకి మొదటి విడతగా రూ.20లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్టు తెలిసింది. ఈ క్యాబినెట్ విధానంతో మంత్రివర్గ ఎజెండాలు, నోట్‌లు, నిర్ణయాలు, ఫైళ్లు పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. వాటిని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ట్యాబ్, కంప్యూటర్ ద్వారా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో క్యాబినెట్ నిర్ణయాలు, ఎజెండాలను ఎక్కడినుంచైనా, ఏ సమయంలోనైనా చూసుకోవచ్చు. ఇందుకోసం మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేక పాస్‌వర్డ్, లాగిన్ ఐడీని అందిస్తారు. దీంతో పత్రాల భద్రత, గోప్యత మరింత పెరుగుతుంది.