Share News

ఆహార కల్తీపై డేగ కన్ను!

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:31 AM

కల్తీ ఆహారం, పదార్ధాలపై రాష్ట్ర ప్రభుత్వం డేగ కన్నులా నిఘా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. కల్తీ నివారణ కోసం పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది.

ఆహార కల్తీపై డేగ కన్ను!

  • త్వరలో ‘ఈగల్‌’ తరహాలో ప్రత్యేక వ్యవస్థ

  • కల్తీపై ఫిర్యాదులతో ప్రభుత్వ నిర్ణయం

  • ఇక ఆకస్మిక దాడులు.. లైసెన్సుల రద్దు

  • కల్తీ నిర్ధారణ అయితే కఠిన చర్యలే

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కల్తీ ఆహారం, పదార్ధాలపై రాష్ట్ర ప్రభుత్వం డేగ కన్నులా నిఘా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. కల్తీ నివారణ కోసం పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం గంజాయి, డ్రగ్స్‌, నిషేధిత మత్తు పదార్ధాలపై నియంత్రణకు ఏర్పాటు చేసిన ‘ఈగల్‌’ తరహాలో స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫుడ్‌ సేఫ్టీపై ఈగల్‌ తరహా వ్యవస్థను తెస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దానికి రూపకల్పన చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆహార భద్రత తనిఖీలను ప్రధానంగా ఫుడ్‌ ేసఫ్టీ అధికారులు నిర్వహిస్తున్నారు. విపరీతంగా పెరిగిపోయిన కల్తీ తరుణంలో సిబ్బంది కొరత కారణంగా విస్తృత తనిఖీలు చేయలేకపోతున్నారు. దీంతో ప్రత్యేక అధికారాలు కలిగిన బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. త్వరలో ఏర్పాటయ్యే ఈ వ్యవస్థ ద్వారా మసాలా పొడుల తయారీ యూనిట్లు, వంటనూనెల గోదాములు, పాల ఉత్పత్తుల కేంద్రాలు, మిఠాయిల తయారీ సెంటర్లు, బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పండుగల సమయంలో అధికంగా విక్రయించే ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచి నమూనాలు ేసకరించి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కేంద్రాలపై ప్రత్యేక బృందాలు ఆకస్మికంగా దాడులు చేయడంతో పాటు కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయితే.. వెంటనే భారీ జరిమానాలు విధించడం, వ్యాపార లైసెన్సుల రద్దు చేయడంతో పాటు క్రిమినల్‌ కేసుల నమోదు చేసేలా ప్రత్యేక వ్యవస్థలకు అధికారాలు కట్టబెట్టనున్నారు. అవసరమైతే అరెస్టులు కూడా చేసే అధికారం కూడా ఉంటుందని అధికారికవర్గాల ద్వారా సమాచారం. కాగా, కల్తీ ఉత్పత్తులపై ప్రజలు, వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక టోల్‌-ఫ్రీ నంబరు, ఆన్‌లైన్‌ ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆహార భద్రత చట్టంలోనూ మార్పులు

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,40,744 ఆహార వ్యాపార ఆపరేటర్లు (ఎఫ్‌బీవో) ఉన్నారు. వీటిలో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా కోర్‌ అర్బన్‌ ఏరియాలో 80 వేలకుపైగా వ్యాపారాలు ఉండటం గమనార్హం. కొత్తగా నమోదైన వారు ఈ సంఖ్యకు అదనం. ఈ తరుణంలో ఆహార కల్తీని నివారించేందుకు అవసరమైన పోస్టుల భర్తీ, అత్యాధునిక వాహనాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ వివరాలన్నీ తేలాక ప్రస్తుతమున్న ఆహార భద్రత చట్టంలో కొన్ని సవరణలు కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Jun 22 , 2026 | 04:31 AM