రాష్ట్రంలో కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:24 AM
రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని రోగులు డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు...
ఈ కేంద్రాల్లో 416 పడకల ఏర్పాటు
ఇప్పటికే ఉన్న సెంటర్లలో మరో 155
హైదరాబాద్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని రోగులు డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌లో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. హైదరాబాద్‌లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు ప్రధాన హబ్‌లుగా ఉండి క్లినికల్ పర్యవేక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తాయి. ఈ నిర్ణయంతో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ వంటి మారుమూల ప్రాంతాలతో సహా మొత్తం 416 కొత్త బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు, పెరుగుతున్న రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉన్న 67 డయాలసిస్ కేంద్రాల్లో మరో 155 బెడ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రత్యేక మెమో విడుదల చేసింది. దీనివల్ల పేషెంట్ల నిరీక్షణ సమయం తగ్గడంతో పాటు ఎమర్జెన్సీ కేసుల్లో వేగంగా చికిత్స అందుతుంది. టీజీఎంఎ్‌సఐడీసీ ద్వారా కొత్త సెంటర్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, ఆయా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, తగిన స్థలం కేటాయించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.