జూన్ 2 నుంచి 2లక్షల మందికి కొత్త పింఛన్లు
ABN , Publish Date - May 18 , 2026 | 02:59 AM
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు.
రెండో విడత ఇళ్లూ మంజూరు: మంత్రి వివేక్
మిర్యాలగూడ, మే 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నూతనంగా 2లక్షల మందికి పింఛన్లు మంజూరు కోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, వేగవంతంగా దిగుమతులు చేయించేందుకు అధికారులు, మిల్లర్లను సమన్వయం చేస్తూ చర్యలు చేపట్టిందన్నారు. ఈ నెలాఖరులోగా ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా పూర్తయి గృహ ప్రవేశాలు అవుతున్నాయన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ జూన్‌లో ప్రారంభవుతుందని ఆయన తెలిపారు.